రూ.9లక్షలు కొట్టేసిన నిందితులు
ఇద్దరిని అరెస్టు చేసిని హైదరాబాద్ పోలీసులు
వివరాలు వెల్లడించిన సైబర్ క్రైం డిసిపి కవిత
మనతెలంగాణ, సిటిబ్యూరోః పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి నిండా ముంచుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, 15 చెక్‌బుక్‌లు, ఎనిమిది డెబిట్ కార్డులు, రెండు నకిలీ రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం డిసిపి కవిత శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేరళ రాష్ట్రం, కాసర్‌ఘడ్‌కు చెందిన నౌషద్,అహ్మద్ కబీర్ సైబర్ నేరస్థులకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చారు.
హైదరాబాద్‌కు చెందిన బాధితురాలికి టెలీగ్రాంలో జనవరిలో మెసేజ్ వచ్చింది. దాని ఆధారంగా బాధితులకు నిందితులు లింక్ షేర్ చేశారు, దానిని క్లిక్ చేయడంతో నిందితుల గ్రూప్‌లో యాడ్ చేశారు. తర్వాత తాము చెప్పినట్లు లైక్, షేర్ చేయాలని చెప్పారు. బాధితురాలు అలాగే చేయడంతో నెల తర్వాత బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేశారు. అంతర్జాతీయ కంపెనీల రివ్యూలు రాయడం లాంటి టాస్క్లు ఇచ్చారు. పార్ట్ టైం ఉద్యోగం కావడంతో బాధితులు అందులో చేరారు. తర్వాత తాము చెప్పినట్లు పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని బాధితులను నమ్మించారు.
డబ్బులు వస్తున్నాయని నమ్మిన బాధితురాలు తనవ వద్ద ఉన్న రూ.9,44,492 లక్షలు పెట్టుబడిపెట్టింది. డబ్బులు వారికి అందగానే నిందితులు స్పందించడం మానివేశారు. బాధితురాలు డబ్బులు పంపించిన బ్యాంక్ ఖాతా స్తంభింప చేశారు, మీ డబ్బులు మీకు రిలీజ్ కావాలంటే మరింత నగదు జమ చేయాలని చెప్పడంతో దశల వారీగా బాధితురాలు డబ్బులు డిపాజిట్ చేసింది. అయినా మళ్లీ డబ్బులు అడగడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల బ్యాంక్ ఖాతాలో ఇప్పటి వరకు రూ.26కోట్లు డిపాజిట్ అయినట్లు గుర్తించారు.
నిందితులు 18బ్యాంక్‌ఖాతాలకు డబ్బులను మళ్లించినట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులు నకిలీ కెవైసీ ఆధారంగా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసి వాటిని ఇసాక్, రియో, తాహిల్ అలీకి ఇచ్చారు. ఇలా కొట్టేసిన డబ్బులను నిందితులు క్రిప్టో కరెన్సీలోకి మార్చి దుబాయ్‌లో మార్చుకుంటున్నారు. అక్కడి నుంచి నిందితులు డబ్బులను చైనాకు తరలిస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్ మట్ట రాజు తదితరులు పట్టుకున్నారు.