ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొని తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఓ సందేశం పంపారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్ అని, నేను ఉగ్రవాదిని కాదు అని’, కేజ్రీవాల్ సందేశాన్ని పంపారని వివరించారు. కేజ్రీవాల్ మనోభావాలను దెబ్బతీసేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తుందని, కేజ్రీవాల్‌ను ఎంత విచ్ఛిన్నం చేస్తే అంతే బలంగా పైకి లేస్తారని హెచ్చరించారు. కేజ్రీవాల్‌పై బిజెపి వ్యవహరిస్తున్న తీరు సరికాదని సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిఎం కేజ్రీవాల్‌తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ సమావేశమైనప్పుడు ఆయనపై బిజెపి ఎంత ద్వేషించిందో తెలుస్తుందన్నారు. జడ్ ప్లస్ భద్రత కలిగి ఉన్న భగవంత్ మాన్ కూడా కేజ్రీవాల్‌ను గాజు అద్దం వెనుక నుంచి కలుసుకునేలా చేశారని సంజయ్ సింగ్ దుయ్యబట్టారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు చెప్పినప్పటికి, ఓ ఇంటర్యూలో ఎలక్టోరల్ బాండ్ స్కీమును సమర్థించారని, దీంతో ఆయన సుప్రీం కోర్టు అవమానించడమేనని, వెంటనే అత్యున్నత న్యాయస్థానం, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.