Monday, November 25, 2024

బస్తర్‌కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు

- Advertisement -
- Advertisement -

బస్తర్‌కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు
నక్సల్ ప్రభావిత జిల్లాలలో భారీ భద్రతా ఏర్పాట్లు
ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ సీట్లకు 3 దశలలో పోలింగ్

బీజాపూర్ /సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ ప్రభావిత బస్తర్ లోక్‌సభ నియోజవకవర్గానికి హెలిపాక్టర్లలో పోలింగ్ సిబ్బందిని తరలించే ప్రక్రియ గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య మంగళవారం ప్రారంభమైంది. బస్తర్ నియోజకవర్గంలో ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనున్నది. బీజాపూర్, సుక్మా జిల్లాలలోని సున్నిత ప్రాంతాలలోగల పోలింగ్ కేంద్రాలకు ఇవిఎంలు, పోలింగ్ సిబ్బందిని తరలించే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. బస్తర్ లోక్‌సభ నియోజకవర్గానికి దక్షిణ భాగంలో ఉన్న బీజాపూర్, సుక్మా జిల్లాలలో గతంలో ఎన్నికల సందర్భంగా భద్రతా సిబ్బందిపై నక్సల్స్ దాడులు జరిపిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. బీజాపూర్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం మొత్తం 245 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో మారుమూల ప్రాంతాలలో ఉన్న 99 కేంద్రాలను సురక్షిత ప్రాంతాలకు మార్చినట్లు బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే మంగళవారం తెలిపారు.

76 పోలింగ్ బృందాలను వారి గమ్యస్థానాలకు హెలికాప్టర్లలో తరలించే ప్రక్రియ బీజాపూర్ జిల్లా ప్రధాన కార్యాలయంలో మంగళవారం, పోలింగ్‌కు 3 రోజుల ముందు ప్రారంభమైందని ఆయన చెప్పారు. పోలింగ్ బృందాలు తమ గమ్యస్థానాలకు పోలింగ్ ముందు రోజు చేరుకుంటాయని, ఆ రోజు సమీపంలోని భద్రతా దళాల స్థావరంలో బస చేస్తాయని కలెక్టర్ చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు పాండే తెలిపారు. బీజాపూర్ జిల్లాలో ఎన్నికల కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, గాలింపు చర్యలను ఉధృతం చేశామని జిల్లా ఎస్‌పి జితేంద్ర యాదవ్ తెలిపారు. పొరుగున ఉన్న సుక్మా జిల్లాకు పోలింగ్ బృందాలను పంపించినట్లు మరో అధికారి చెప్పారు. సుక్మా జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి హెలికాప్టర్లలో 27 పోలింగ్ బృందాలను, ఇవిఎంలను మంగళవారం తరలించినట్లు ఆయన చెప్పారు. సుక్మా జిల్లాలో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 42 పోలింగ్ కేంద్రాలకు హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ సిబ్బందిని తరలిస్తున్నట్లు సుక్మా జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు.

మారుమూల ప్రాంతాలలోని 42 పోలింగ్ కేంద్రాలను సురక్షిత ప్రాంతాలకు మార్చినట్లు ఆయన వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న మూడు దశలలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. తొలి దశలో ఏప్రిల్ 19న బస్తర్ లోక్‌సభ స్థానంలో మాత్రమే పోలింగ్ జరగనున్నది. మహసముంద్‌రాజ్‌నంద్‌గావ్, కంకెర్(ఎస్‌టి) నియోజకవర్గాలలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన ఏడు స్థానాలైన రాయపూర్, దుర్గ్, బిలాస్‌పూర్, రాజ్‌గఢ్(ఎస్‌టి), కరోబా, జాంగిర్-చంపా(ఎస్‌సి), సుర్గుజ(ఎస్‌టి)లో మే 7న మూడవ దశలో ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News