Saturday, December 21, 2024

బట్లర్ అజేయ శతకం… రాజస్థాన్ సూపర్ విక్టరీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది.

ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇది ఆరో విజయం కావడం విశేషం. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ను ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకంతో ఆదుకున్నాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 60 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 9 ఫోర్లతో 107 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రియాన్ పరాగ్ (34), రొమన్ పొవెల్ (26) తమవంతు పాత్ర పోషించారు.

నరైన్ జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్ సునీల్ నరైన్ అండగా నిలిచాడు. ఆరంభం నుంచే నరైన్ దూకుడును ప్రదర్శించాడు. మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (10) ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన రఘువంశీతో కలిసి నరైన్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన నరైన్ రాజస్థాన్ బౌలర్లను హడలెత్తించాడు. భారీ షాట్లతో విరుచుకు పడిన నరైన్ స్కోరును పరిగెత్తించాడు.

మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన రఘువంశీ 5 ఫోర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (11), ఆండ్రీ రసెల్ (13) ధాటిగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. రింకు సింగ్ 9 బంతుల్లోనే 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన నరైన్ 58 బంతుల్లోనే 13 ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు. నరైన్ విధ్వంసక సెంచరీ సాధించడంతో కోల్‌కతా స్కోరు 6 వికెట్లకు 223 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News