Monday, December 23, 2024

రైతుల్లో ఆశల జల్లులు

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం, స్కైమెట్ ముందస్తు అంచనాలు రైతులకు ఆనందం కలిగించే శుభవార్త. ఈ దఫా కూడా ఎల్‌నినో (వర్షాభావ) పరిస్థితులే ఉంటాయనే వార్తల మధ్య వర్షాలు దండిగానే కురుస్తాయనే ఐఎండి అధికారిక ప్రకటన ఒక్క వ్యవసాయ రంగంలోనే కాకుండా దానికి అనుబంధంగా ఉన్న అన్ని రంగాలకు కూడా ఆనందకరమైన వార్తనే. అయితే గత ఖరీఫ్ సీజన్‌కు ముందు కూడా ఐఎండి సాధారణ వర్షపాతమే నమోదవుతుందనీ ముందస్తుగానే ప్రకటించినా ప్రస్తుత సీజన్‌లో 94 శాతం వరకే వర్షపాతం నమోదు కావడంతో రైతుల్లో ఇంకా వానలపై నమ్మకం కలగడం లేదు.

అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా మన దేశంలో కూడా వర్షాలు, వరదలు, ఎండలు, అతిశీతలం లాంటి వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేసే ఆధునిక వ్యవస్థ ఇంకా ఇక్కడ ఏర్పాటు కాలేదు. అమెరికాలో రైతులే కాకుండా ప్రజలు కూడా అక్కడి వాతావరణ హెచ్చరికల గురించి అధికారిక వాతావరణ వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడతారు. అక్కడి అంచనాలు దాదాపుగా 99 శాతం ఖచ్చితంగా ఉంటాయి. ఆ స్థాయిలో మనకింకా వాతావరణ వ్యవస్థలు ఏర్పడలేదు. దీని కారణంగానే మన వాతావరణ అంచనాలపై పూర్తిగా విశ్వాస పరిస్థితి ఏర్పడలేదు. అయినా అనుకూల దృక్పథంతో మనకు వచ్చే సీజన్‌లో మంచి వర్షాలే కురుస్తాయని ఆశిద్దాం.

దానికి తగినట్లుగా వ్యవసాయ శాఖ ప్రణాళికలను సిద్ధం చేయాలి. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే అందుకు తగినట్లుగా ప్రత్యామ్నాయ ప్రణాళికలతో యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. ఇక ఐఎండి అంచనాలను పరిశీలిస్తే, సాధారణం అంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నైరుతి రుతుపవనాల కారణంగా సుదీర్ఘకాల సరాసరి వర్షపాతం 96 నుంచి 104 శాతం వరకు 868 మి.మీ వర్షం కురుస్తుందని ప్రామాణికంగా అర్థం చేసుకోవాలి. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ వాటా 17.6 శాతమే. ఇది రకరకాల కారణాల వల్ల ప్రతియేటా తగ్గుతూ వస్తున్నది.ఇది ఆందోళనకర పరిణామమే. అయితే జాతీయ ఆదాయానికి వర్షాధార పంటభూముల నుంచి వచ్చే ఆదాయం 55 నుంచి 60 శాతం వరకు ఉంటుంది. దేశం సగానికి సగం సాగు భూముల్లో 141.4 మిలియన్ హెక్టార్ల భూములు నీటి పారుదల సౌకర్యం లేనివి.

కేవలం వర్షాధారంగానే సాగు అవుతుంటాయి. ఐదింట మూడొంతుల కంటే ఎక్కువ మంది రైతులు ఎలాంటి నీటిపారుదల సౌకర్యం లేక తమ భూములను వర్షాధారంగా పండించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం రైతులకు శుభవార్త గానే పరిగణించక తప్పదు. అయితే ఈ ముందస్తు అంచనాలు ఎప్పుడూ కచ్చితంగా ఉండవు. గత ఏడాది ఐఎండి (భారత వాతావరణ విభాగం) సాధారణ వర్షపాతం ఉంటుందని ముందుగా తెలియజేసినప్పటికీ, సాధారణం కన్నా తక్కువ గానే సుదీర్ఘకాల సరాసరిలో 94 శాతం వరకే వర్షం కురిసింది. సాధారణం లేదా సాధారణం కన్నా మించి వర్షపాతం అన్న అంచనాలు ఆయా సీజన్‌లో మొత్తం వర్షపాతాన్ని సూచిస్తాయి తప్ప ప్రాదేశిక, తాత్కాలిక వర్షపాతం పరిస్థితిని చెప్పలేవు. అవి చాలా అసమానంగా కూడా ఉంటాయి.

ఎల్‌నినో, లానినో ప్రభావం ఆధారంగా ఐఎండి, స్కైమెట్ అంచనాలు వెలువడుతుంటాయి. ఎల్‌నినో వర్షాభావ పరిస్థితిని చెప్పగా, లానినో విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితిని చెబుతుంది. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతంలో సముద్ర ఉపరితలం వేడెక్కడంపై ఎల్‌నినో ప్రభావం అంచనా వేస్తారు. ఇది గత ఏడాదిలా నైరుతి రుతుపవనాలను బలహీనం చేయవచ్చు.ఈ ప్రభావంతో సీజన్ బలహీనంగానే ప్రారంభం కావచ్చునని స్కైమెట్ అంచనా. ఐఎండి కూడా ఇంచుమించు ఇదే విధంగా అంచనా వేసింది. అయితే ఈ రెండు సంస్థలు లానినో విషయంలో ఏకాభిప్రాయం వెలిబుచ్చాయి. పసిఫిక్ సముద్రం ఉపరితలం వేడి చల్లారి ఆగస్టులో నైరుతి పవనాలు బలం పుంజుకుంటాయని చెబుతున్నాయి. హిందూ మహాసముద్రం లోని ద్విధ్రువ పరిస్థితులు వర్షాగమనానికి అనుకూలంగా ఉంటాయని ఐఎండి సూచిస్తోంది.

పశ్చిమ హిందూ మహాసముద్ర ఉపరితలం వేడెక్కితే, తూర్పు హిందూ మహాసముద్ర ఉపరితలం చల్లగా ఉంటుందని చెబుతున్నారు. రెండవ అర్ధభాగ సీజన్‌లో మొదటిభాగం వాతావరణ పరిస్థితులు కన్నా మెరుగ్గా ఉంటుందని అంచనా. ఖరీఫ్ సీజన్ లేదా వేసవిలో జూన్, జులైలో వరి, చిరుధాన్యాలు, కాయధాన్యాలు, సొయాబీన్ వంటివి సాగు చేయడానికి కీలకమైన కాలం. వీటికి సాధారణ, సాధారణానికి మించి వర్షపాతం లభిస్తే చాలా మేలు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News