Sunday, November 24, 2024

ఇందూరులో అతిథులకే అందలం

- Advertisement -
- Advertisement -

విలక్షణ తీర్పునకు ఆద్యులు ఇక్కడి ఓటర్లు
17సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే 11సార్లు స్థానికేతరులకే పట్టం, అందుబాటులో ఉండని అతిధి ఎంపిలు

1952 నుంచి మొదలైన సార్వత్రిక ఎన్నిక ప్రస్థ్థానంలో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. 9మంది ఎంపిలుగా గెలిచారు. వీరిలో ఇద్దరు మినహా మిగతా అందరూ కేవలం చుట్టపు చూపుగా వచ్చి గెలిచిన వారే! స్థానిక నాయకుల కన్నా అతిథులుగా వచ్చిన వారినే జిల్లా ఓటర్లు ఆదరిస్తున్నారు. దిగ్గజ నేతలున్నా జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు వచ్చాయంటే అతిథి నేతలే ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి వస్తున్న నేతలు జిల్లాకు చెందిన బడా నేతలను ఓడించి ఎంపిలుగా గెలుస్తున్నారు. అయితే అతిథులుగా వచ్చి ఎంపిలుగా గెలుస్తున్న వారు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఎంపిలుగా గెలిచిన వారిలో కేశ్‌పల్లి గంగారెడ్డి ఒక్కరికే జిల్లా కేంద్రంలో సొంత ఇల్లు ఉండేది.

అంబోజి రామకృష్ణప్రసాద్/నిజామాబాద్ బ్యూరో: 1952 నుంచి 1989 వరకు తొమ్మిది పర్యాయాలు ఎంపి ఎన్నికలు జరిగితే ఒక్కసారి మాత్రమే జిల్లాకు చెందిన వ్యక్తి ఎంపిగా ఎన్నికయ్యారు. మిగతా 8సార్లు జి ల్లాకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులే ఎంపిలుగా గెలిచారు. 1952, 1957, 1962లో జరిగిన మొదటి మూడు ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన హరీశ్‌చంద్ర హుడా ఎంపిగా హ్యాట్రిక్ సాధించారు. మూడుసార్లు ఎంపిగా గెలిచినా అర డజన్ సార్లు కూడా ఆయన జిల్లాకు రాలేదట. కనీసం జిల్లా కేంద్రంలో ఉండడానికి అద్దె ఇల్లు కూడా ఆయన తీసుకోలేదట అనే అంశాన్ని యువ న్యాయవా ది నారాయణ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు.

అప్పుడు తొలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుండడంతో నాలుగోసారి పోటీ చేసిన హరీశ్ చంద్ర ఓడిపోయారు. ఆర్మూర్‌కు చెందిన న్యాయవాది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణరెడ్డి గెలిచారు. కానీ 1971 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ మచ్చుకైనా కనిపించలేదు. అందుకే తెలంగాణ ప్రజా సమితి తరపున పోటీ చేసిన బాల్కొండకు చెందిన ప్రముఖ న్యాయవాది అనంతరెడ్డి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో రాంగోపాల్‌రెడ్డి 51.73 శాతం ఓట్లు సాధించారు. 1977లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో న్యాయవాది గంగారెడ్డి భారతీయ లోక్‌దళ్ నుంచి పోటీ చేసినప్పటికీ మూడోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాంగోపాల్ రెడ్డి ఏకంగా 70.66 శాతం ఓట్లు సాధించారు.

1980 ఎన్నికల్లోనూ రాంగోపాల్‌రెడ్డి మూడోసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆర్మూర్‌కు చెందిన కె.ఎం. ఖాన్ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ రాంగోపాల్‌రెడ్డే భారీ మెజారిటీతో గెలిచారు. 1971, 1977, 1980 ఎన్నికల్లో రికార్డ్ మెజార్టీతో ఎంపిగా హ్యాట్రిక్ కొ ట్టారు. ఆయన కూడా జిల్లాలో ఉండడానికి తికానా ఉంచుకోలేదు. వయస్సు పైబడడంతో 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించారు. కానీ ఆ ఎన్నికలో నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మెదక్ నియోజకవర్గంలో ఉండే ఎల్లారెడ్డి తా లూకాకు చెందిన తాడురి బాలాగౌడ్‌ను నిలబెట్టింది. తెలుగుదేశం ప్రభంజనంలోనూ బాలాగౌడ్ మొదటిసారి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నారాయణ రెడ్డిపై ఎంపిగా గెలిచారు.

1987 ఎన్నికల్లోనూ బాలాగౌడ్ రెండోసారి ఎంపిగా భారీ మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై గెలిచారు. పదేళ్లు ఎంపిగా పనిచేసిన బాలాగౌడ్ సొంత ఖర్చులతో ఢిల్లీలో కాంగ్రెస్ భవనం కట్టించారు. కానీ జిల్లా కేంద్రంలో కనీసం అద్దె ఇల్లు కూడా ఆయనకు ఉండేది కాదు. కానీ 1991 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా జక్రాన్‌పల్లికి చెందిన కేశ్‌పల్లి గంగారెడ్డి బరిలోకి దిగి మూడోసారి పోటీ చేస్తున్న బాలాగౌడ్‌ను ఓడించారు. గంగారెడ్డి రాజకీయాల్లోకి రాక ముందే సుభాష్‌నగర్‌లో సొంత ఇల్లు ఉంది. 1996 ఎన్నికల్లో గంగారెడ్డికి తెలుగుదేశం పా ర్టీ టికెట్ ఇవ్వలేదు. టిడిపి విప్ ధిక్కరించి గంగారెడ్డి పి.వి సర్కార్‌కు ఓటు వేశారు. దీంతో 1996 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంఎల్‌ఎ మండవ వెంకటేశ్వర్‌రావు బరిలోకి దిగారు. ఈసారి కాంగ్రెస్ ఏకంగా అమెరికాలో ఉంటున్న ఆత్మచరణ్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. జిల్లా ఓటర్లు అమెరికా నుంచి వచ్చిన ఆత్మచరణ్ రెడ్డిని ఆదరించారు. ఆయన 45 వేల మెజార్టీతో గెలిచారు.

అయితే, ఆయన ఐదేళ్ల కాలంలో ఎక్కువగా అమెరికాకే పరిమితమయ్యారు. కనీసం జిల్లా కేంద్రంలో ఠికానా కూడా ఉండేది కాదు. దీంతో 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనకు టికెట్ నిరాకరించి కె. కేశవరావుకు ఇచ్చింది. కానీ టిడిపిలో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన కేశ్‌పల్లి గంగారెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. సిట్టింగ్ ఎంపిగా ఉన్న ఆత్మచరణ్ రెడ్డి బిజెపి నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కేశ్‌పల్లి గంగారెడ్డి గెలిచారు. మొత్తం లోక్‌సభ ఎన్నికల చరిత్రలో జిల్లాకు చెందిన నేతలు తలపడింది. 1999లోనే టిడిపి అభ్యర్థిగా గంగారెడ్డి కాం గ్రెస్ అభ్యర్థిగా శనిగరం సంతోష్ రెడ్డి పోటీ చేశారు. కేవలం నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గంగారెడ్డి గెలిచారు. అమెరికాలో స్థిరపడిన మధుగౌడ్‌ను 2004లో కాంగ్రెస్ తమ అభ్యర్థిగా నిలిపింది. టిడిపి అభ్యర్థిగా కామారెడ్డికి చెందిన యూసుఫ్ అలీ పోటీ చేశారు.

ఈ ఎన్నికల్లో మధుగౌడ్ భారీ మెజార్టీతో గెలిచారు. 2009 ఎన్నికల్లోనూ మధుగౌడ్ రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా తెరాస అభ్యర్థిగా మాక్లూర్‌కు చెందిన గణేష్ గుప్తా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మధుగౌడ్ రెండోసారి ఎంపిగా గెలిచారు. కానీ మధుగౌడ్ పదేళ్లు ఓ అద్దె ఇల్లు తీసుకున్నప్పటికీ ఆయన ఎక్కువగా జిల్లాకు వచ్చేవారు కాదు. అందుకే ఆయన తదుపరి రెండుసార్లు ఎంపిగా పోటీ చేసినా ఓడిపోయారు. తెలంగాణ ఏర్పా టయ్యాక జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పోటీ చేశారు. ఆమె మెట్టినిల్లు ని జామాబాద్ అయినప్పటికీ అమెరికా, హైదరాబాద్‌కే పరిమితం అయ్యాదు. అయినప్పటికీ ఎంపిగా భారీ మెజారిటీతో గెలిచారు. కానీ ఆమె కూ డా ఎక్కువగా అందుబాటులో ఉండకపోయే వారు. అందుకే 2019 ఎన్నికల్లో డిఎస్ తనయుడు అర్వింద్ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో నూ బిఆర్‌ఎస్, బిజెపి అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, ధర్మపురి అర్వింద్ ఇద్దరూ నిజామాబాద్ జిల్లాకు చెందినవారే. కాంగ్రెస్ తరఫున అభ్యర్థి జగిత్యాల జిల్లాకు చెందిన జీవన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News