హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈసారి దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంపై హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనాలు వెలువరించింది. జూన్ 8 నుంచి 11వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని భావిస్తున్నామని వెల్లడించింది.
రుతుపవనాలు వస్తూనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని, జులైలో భారీ వర్షాలు పడతాయని వివరించింది. ఆగస్టులో సాధారణ రీతిలో వర్ష పాతం నమోదవుతుందని, మళ్లీ సెప్టెంబరులో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్ నినో పరిస్థితులు జూన్ నాటికి పూర్తిగా క్షీణిస్తాయని, జులైలో ఎల్ నినో అనుకూల పరిస్థితులు ఊపందుకుంటాయని వివరించింది. గత సీజన్ తో పోల్చితే ఈసారి రాష్ట్రంలో జలాశయాల్లో ఎక్కడా నీటి కొరత ఉండకపోవచ్చని వెల్లడించింది. రాష్ట్రంలో సాధారణం మించి అధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.