4వ విడత పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల
వచ్చే నెల 13వ తేదీన ఓటింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ దఫానే
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత నామినేషషన్ల ప్రక్రియ గురువారం ఆరంభమైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం భారత రాష్ట్రపతి తరఫున గురువారం వెలువరించింది. నాలుగో విడత పోలింగ్ మే 13వ తేదీన జరుగుతుంది. ఈ దఫా తొమ్మిది రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం విస్తరిచుకుని మొత్తం 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ తేదీనే ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. తెలంగాణలో 17 స్థానాలకు, ఎపిలో 25 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జమ్మూ కశ్మీర్‌లలో కూడా వేర్వేరు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ఉంటుంది.
కాగా జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ స్థానానికి నామినేషన్ల నోటిఫికేషన్‌ను జిల్లా కలెక్టర్ బిలాల్ మెహియుద్దిన్ భట్ విడుదల చేశారు. ఇక ఈ నాలుగో విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 25. పత్రాల పరిశీలన మరుసటిరోజు ఉంటుంది. ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 29 అని భట్ తెలిపారు. శ్రీనగర్ స్థానం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున షియా నేత ఆగా రుహల్లాహ్ బరిలో ఉన్నారు. పిడిపి నుంచి పార్టీ యువజన విభాగంఅధ్యక్షులు వాహీద్ పారా, అప్ని పార్టీ నుంచి మెహమ్మద్ అష్రఫ్ మీర్ పోటీకి నిలిచారు.