బిఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో కెసిఆర్ తన పార్టీ నాయకులతో గురువారం సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, బస్సు యాత్రపై నేతలతో చర్చించారు. పార్టీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థులకు బీఫాం, రూ.95 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరిం చాల్సిన వ్యూహంపై పార్టీ ప్రతినిధులతో చర్చిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో 20 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు టచ్‌లో ఉన్నారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అసవరం లేదన్నారు. అయితే మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ఉంటారా? అని ప్రశ్నించారు.
20 మంది ఎంఎల్‌ఎలను తీసుకొని రావాలా సార్ అని ఓ సీనియర్ కీలక నేత తనను సంప్రదించాడని, ఇప్పుడే వద్దని వారించానని తెలిపారు. కాంగ్రెస్‌లో టీమ్ వర్క్ లేదు, స్థిరత్వం లేదు. ఇప్పటివరకు 8లోక్‌సభ సీట్లలో గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయి. మరో మూడు స్థానాల్లో విజయావకాశా ఉన్నాయని స్పష్టం చేశారు. ఎంఐఎంతో 111 మంది ఎంఎల్‌ఎలు ఉన్నప్పుడే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారన్నారు. తాము దొరకబట్టుకున్నామని అందుకే మోడీ కక్ష కట్టార వెల్లడించారు. అలాంటిది 64 మంది ఎంఎల్‌ఎలు ఉన్న కాంగ్రెస్‌ను బతకనిస్తారా..? బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లినవాళ్లు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు.
లోక్ సభ ఎన్నికల తర్వాత గందరగోళం
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని, ఆ సమయంలో ఏం జరిగినా బిఆర్‌ఎస్‌కే మేలు జరుగుతుందన్నారు. త్వరలో ఉద్యమకాలం నాటి కెసిఆర్‌ను చూస్తారన్నారు. భవిష్యత్ మనదేనని పార్టీ నేతలకు కెసిఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌పై అప్పుడే తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందన్నా రానున్న రోజులు మనవేనని, పార్లమెంట్‌లో మ గళం వినిపించాలన్నారు. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన బిఆర్‌ఎస్‌కు నష్టం ఏమీ లేదన్నారు.
ఎన్నికల ప్రచారానికి సరికొత్త పంథా
కాగా, పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కెసిఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నారు. రైతు సమస్యలు అజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలన్నారు. రైతు సమస్యలపై పోస్టుకార్డు ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో లక్ష పోస్టు కార్డులు రాయాలన్నారు. రైతుల కల్లాల కాడికి వెళ్లి రూ.500 బోనస్‌పై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ప్రభుత్వ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలని వెల్లడించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. దానిని అనుకూలంగా మలుచుకోవాలని కెసిఆర్ సూచించారు. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఉదయం 11 గంటల వరకు పొలంబాట, సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు నుంచి మూడు చోట్ల రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. సిద్దిపేట్, వరంగల్‌లో లక్షమందితో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఒకే కారులో తెలంగాణ భవన్‌కు వచ్చిన హరీశ్ రావు
తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ పార్టీ కీలక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్ రావు, హుజూరాబాద్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి ఒకే కారులో కలిసి వచ్చారు. హరీశ్ రావు, కెటిఆర్‌లకు బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ ఎంపిలు, మాజీ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌సిలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, జెడ్‌పి చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.