న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికీ ఎస్సీలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. షెడ్యూల్ కులం, షెడ్యూల్ ట్రయిబ్ అయినందుకు బిజెపి ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లను అగౌరపరిచిందన్నారు. రామ మందిర శిలాప్రతిష్ఠాపన ఉత్సవానికి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి కూడా ఆమెను పిలువలేదు. కాగా కొత్త పార్లమెంటు భవన శంకు స్థాపనకు కూడా కొవింద్ ను అనుమతించలేదన్ర్నారు.
‘‘ ఒకవేళ నేను అయోధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లి ఉంటే వారు సహించేవారా?’’ అని ప్రశ్నించారు. మోడీ తాము 400కు పైగా పార్లమెంటు సీట్లను సాధిస్తామని అనడం అంతా చెత్త. తాను మూడోసారి అధికారంలోకి వస్తానని కలలు కంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఖర్గే స్పష్టం చేశారు. వారిని మరో గెలిపించే విషయంలో హెచ్చరికగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. వారు మరోసారి అధికారం చేజిక్కించుకుంటే రాజ్యాంగాన్నే మార్చేస్తారని అన్నారు. ఇప్పటికే వారీ విషయం గురించి మాట్లాడుతున్నారని అన్నారు.
రామ మందిరంలోకి ఎవరైనా వెళ్లాలనుకుంటే ఎప్పుడైనా వెళ్లవచ్చు…మోడీ ఏమీ పూజారి కాడు. విగ్రహ ప్రతిష్ఠాపనలో మోడీ అగ్రత్వం ఎందుకు తీసుకున్నాడు? …అదంతా రాజకీయ ఉద్దేశ్యంతో చేసిందే. ఆలయానికి సంబంధించినంత వరకు మూడింట ఇంకా ఒక వంతు పనులు పూర్తే కాలేదు…అదంతా ఓ రాజకీయ కార్యక్రమమే కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం కాదని ఖర్గే వివరించారు. మా కులం జనులను నేటికీ చాలా గుళ్లలోకి అనుమతించడం లేదు. కొన్ని గ్రామాల్లో నైతే త్రాగు నీరు, విద్య వంటి వాటికి దూరంగా ఉంచుతున్నారు. మా కులం పెళ్లి కొడుకును గుర్రాల మీద ఊరేగింపుగా వెళ్లడాన్ని కూడా అనుమతించడం లేదు. వారు అలాంటి వారిని కిందికి లాగేసి మరీ బాదుతున్నారు. ఇలాంటి స్థితిలో నేను మందిర విగ్రహ ప్రతిష్ఠాపనకు వెళ్లాలా? ’’ అని ఖర్గే చెప్పుకొచ్చారు. ఆయన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి.