న్యూఢిల్లీ: తీహార్ జైలులో మెల్లమెల్లగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేసే కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ శనివారం అన్నారు. జైలులో ఇన్సూలిన్, డాక్టర్ కన్సల్టేషన్ కోరుతూ ఆప్ విన్నవించుకోగా ఢిల్లీ కోర్టు దాని పై తన ఉత్తర్వును రిజర్వులో పెట్టేశాక ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టైప్-2 డయబెటీస్ తో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ కు జైలు అధికారులు ఇన్సూలిన్ నిరాకరిస్తున్నారని ఆప్ నాయకుడు ఆరోపించారు. ‘‘కేజ్రీవాల్ ను మెల్లమెల్లగా చంపేసే కుట్ర జరుగుతోందన్నది నేను పూర్తి బాధ్యతాయుతంగానే చెబుతున్నాను’’ అని భరద్వాజ్ తెలిపారు. అందుకు బలంగా ఆయన పడిపోతున్న కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ రీడింగ్స్ ను పేర్కొన్నారు. తీహార్ జైలు పాలకాధికారులు, బిజెపి, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తదితరులు కేజ్రీవాల్ కు ఇన్సూలిన్ నిరాకరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఇదిలావుండగా బెయిల్ దొరికించుకోవడం కోసం అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్లు, ఆలూ-పూరీ, టీలో చక్కెర తీసుకుంటూ తన షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నారని గత వారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) పేర్కొంది. కాగా బెయిల్ కోసం ఢిల్లీ సిఎం పక్షవాతం కొనితెచ్చుకునే రిస్క్ కు పాల్పడబోరని అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ శుక్రవారం విచారణ సమయంలో వాదించారు.