న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ దేశంలో అవినీతి పాఠశాల నడుపుతున్నారని, సమస్త అవినీతి శాస్త్రంలోని అన్ని అంకాలపై పాఠాలు బోధిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొత్త ప్రచార ప్రకటన వీడియోను రాహుల్ షేర్ చేశారు. ఎన్నికల బాండ్ల పథకంపై బిజెపిని ఆయన ఎండగట్టారు. దేశంలో అవినీతి పాఠశాలను నరేంద్ర మోడీ నడుపుతున్నారు.
విరాళ వ్యాపారంతోసహా అవినీతి శాస్త్రానికి చెందిన అన్ని అంకాలపై ఆయన పాఠాలు బోధిస్తున్నారు అంటూ రాహుల్ ఆరోపించారు. దాడుల ద్వారా ఎలా విరాళాలు సేకరించవచ్చో, విరాళాలు పుచ్చుకున్న తర్వాత ఎలా కాంట్రాక్టులు పంపిణీ చేయవచ్చో ప్రధాని మోడీ పాఠాలు చెబుతున్నారని రాహుల్ ఆరోపించారు. అవినీతి శుభ్రం చేసే వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది? దర్యాప్తు సంస్థలను రికవరీ ఏజెంట్లుగా మార్చి బెయిల్, జైల్ ఆటను ఎలా ఆడవచ్చు అంటూ కాంగ్రెస్ ప్రచార ప్రకటనను ప్రస్తావిస్తూ రాహుల్ వ్యాఖ్యానించారు.
అవినీతిపరుల డెన్‌గా మారిపోయిన బిజెపి తన నాయకులకు అవినీతి శాస్త్రంలో క్రాష్ కోర్సులను తప్పనిసరి చేసిందని, ఇందుకు దేశం మూల్యం చెల్లించాల్సి వస్తోందని రాహుల్ విమర్శించారు. ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవినీతి పాఠశాలను మూసివేసి అవినీతి కోర్సులను శాశ్వతంగా అంతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాగా..కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా కాంగ్రెస్ తాజా ప్రచార ప్రకటనను కూడా ఎక్స్‌లో షేర్ చేశారు. హఫ్తా వసూల్ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవద్దు..మార్పును కోరుకుంటూ కాంగ్రెస్‌కు ఓటు వేయండి అంటూ ఆయన పిలుపునిచ్చారు.