ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసి చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ ఓవైసి ప్రచారం చేసుకుంటూ ఓ బీఫ్ షాప్ లోకి వెళ్లి కోయండి, కోస్తూనే ఉండండి, తినండి అని మాట్లాడుతున్నారని, తాను కూడా ఒక పందిని కోసే షాప్ లోకి వెళ్లి అదే కామెంట్ చేస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్న రాజాసింగ్ అని ఏడ్చే వాడివని అసదుద్దీన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని రాజాసింగ్ ప్రశ్నించారు.
యావత్ భారతదేశంలో 100 కోట్ల మంది హిందువుల గోమాతను తమ తల్లిలాగా చూసి దేవుడిలా పూజిస్తారని, నువ్వు ఇలాంటి కామెంట్లు చేసి ఓటు బ్యాంకు రాజకీయం ఆడుతున్నావని, చీప్ రాజకీయాలు చేస్తున్నావని ఓవైసిపై మండిపడ్డారు. పోలీసులు సుమోటో కేసు బుక్ చేయోచ్చు కదా అని ప్రశ్నించారు. కాని పోలీసులు అలా చేయరని, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసదుద్దీన్ కి మద్దతుగా ఉంటే.. పోలీసులు కూడా ఉండాలి కదా! ప్రతీసారి ఇలాగే అవుతుందని రాజాసింగ్ అన్నారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేయాలని అభ్యర్థించారు. ఓవైసి తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.