300 సీట్లలో కూడా పోటీ చేయలేకపోతున్న ఆ పార్టీ
2014 ముందు పరిస్థితులు రావాలని దేశం కోరుకోవడం లేదు
జలోరె ర్యాలీలో ప్రధాని మోడీ
జైపూర్ : కాంగ్రెస్ ‘పాపాలకు’ ఆ పార్టీని దేశం శిక్షిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చెప్పారు. ఒకప్పుడు 400 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 300 సీట్లకు పోటీ చేయలేకపోతోందని మోడీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్ జలోరె జిల్లాలో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, ‘తొలి విడత వోటింగ్‌లో సగం రాజస్థాన్ కాంగ్రెస్‌ను శిక్షించింది. ‘దేశభక్తితో నిండిన రాజస్థాన్‌కు కాంగ్రెస్ పార్టీ భారత్‌ను సుదృఢం చేయజాలదని తెలుసు’ అని అన్నారు. 2014 ముందునాటి పరిస్థితులు పునరావృతం కావాలని దేశం కోరుకోవడం లేదని మోడీ చెప్పారు.
‘ఆశ్రిత పక్షపాతం, అవినీతిచెదల వ్యాప్తి ద్వారా దేశాన్ని కాంగ్రెస్ దెబ్బ తీసింది. ఇప్పుడు దేశం కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉంది. ఆ పాపాలకు పార్టీని దేశం శిక్షిస్తోంది’ అని ఆయన అన్నారు.‘తన ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ స్వీయ విమర్శ చేసుకోవలసి ఉంటుంది& ఒకప్పుడు 400 సీట్లు గెలుచుకున్న పార్టీ ఇప్పుడు సొంతంగా 300 సీట్లకు పోటీ చేయలేకపోతోంది’ అని మోడీ వ్యాఖ్యానించారు. బిజెపి అభ్యర్థి లుంబారామ్ చౌదరికి మద్దతుగా జలోరె జిల్లా భిన్మల్‌లో ఒక బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. చౌదరి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌తో పోటీ పడుతున్నారు.
జలోరె బిజెపికి కంచుకోటగా ఉంటున్నది. బిజెపి రెండు దశాబ్దాలుగా ఈ సీటును గెలుస్తున్నది. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని పరోక్షంగా మోడీ విమర్శిస్తూ, ‘ఎన్నికల్లో గెలవలేనివారు బరిలో నుంచి తప్పుకుని’ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలు అయ్యారని అన్నారు. సోనియా గాంధీ ఏకగ్రీవంగా పార్లమెంట్ ఎగువ సభకు ఎన్నికైన కొన్ని నెలల తరువాత మోడీ ఈ వ్యాఖ్య చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి ముందు సోనియా గాంధీ రెండు దశాబ్దాల పాటు లోక్‌సభలో కాంగ్రెస్ కంచుకోట రాయబరేలికి ప్రాతినిధ్యం వహించిన విషయం విదితమే. ఆమె ఐదు సంవత్సరాల పాటు అమేథికి కూడా ప్రాతినిధ్యం వహించారు.