Friday, December 20, 2024

సముద్రంలో కూలిన రెండు జపాన్ నేవీ హెలికాప్టర్లు

- Advertisement -
- Advertisement -

జపాన్‌కు చెందిన రెండు నేవీ హెలికాప్టర్లు శనివారం రాత్రి పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోవగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. వీరికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం 12 యుద్ధ నౌకలు, ఏడు విమానాలు గాలించడానికి బయలుదేరాయి. జపాన్ తీర రక్షణ గస్తీ బోట్లు, విమానాలు కూడా గాలింపులో పాల్గొన్నాయి. ప్రమాదానికి గురైన రెండు హెలికాప్టర్లలో ఒక్కో దానిలో నలుగురేసి నావికులు ఉన్నారు. టోక్యోకు దక్షిణాన 600 కిమీ దూరంలో ఇజు దీవుల్లో ఈ ప్రమాదం జరిగిందని జపాన్ రక్షణ మంత్రి మినోరు కిహారా విలేఖరులకు చెప్పారు. మారిటైమ్ సెల్ఫ్‌డిఫెన్స్ ఫోర్స్ నుంచి ఈ రెండు ఎస్‌హెచ్ 60 కె చాపర్స్ ఒక్కోటి నలుగురేసి నావికులతో శిక్షణ కోసం బయలుదేరాయని, తొరిషిమా ద్వీపం దగ్గర శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత కమ్యూనికేషన్ కోల్పోయాయని చెప్పారు.

కూలిపోడానికి కారణం తక్షణం తెలియదని, అయితే కూలిపోయే ముందు ఇవి ఢీకొని ఉంటాయని అధికారులు చెప్పారు. ప్రమాదానికి కారణం తెలిసేవరకు ఈ ఎస్‌హెచ్ 60 హెలికాప్టర్ల శిక్షణ రద్దవుతుందని, తగిన నివారణ చర్యలు తీసుకుంటామని నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్మిరల్ రియో సకై పేర్కొన్నారు. సహాయక బృందాలు సముద్రంలోంచి విమాన డేటా రికార్డర్, బ్లేడ్‌లను , అదే ప్రదేశంలో విమాన తునకలుగా భావిస్తున్న వాటిని సేకరించారు. గల్లంతైన వారికోసం తమ దేశం కూడా సహకరిస్తుందని జపాన్ లోని అమెరికా రాయబారి రెహ్మ్ ఇమాన్యుయేల్ పేర్కొన్నారు. ఈ విపత్తు సమయంలో మృతుల కుటుంబాలను ఆదుకోవడం, ధైర్యం కల్పించడమే తమ ప్రధాన లక్షమని ఆయన వివరించారు. రెండు ఇంజిన్లతో కూడిన ఈ హెలికాప్టర్లను జపాన్ లోని మితుసుబిషీ పరిశ్రమ తయారు చేయగా, సికోర్సీ సంస్థ అభివృద్ది చేసింది. వీటిని సీహాక్స్ అని అంటారు.

శనివారం రాత్రి యాంటీసబ్‌మెరైన్ శిక్షణలో ఈ హెలికాప్టర్లు ఉండగా ప్రమాదం జరిగింది. వీటిలో ఒకటి రాత్రి 10.38 గంటల ప్రాంతంలో కమ్యూనికేషన్ కోల్పోయిందని రక్షణ మంత్రి కిహారా తెలిపారు. ఒక హెలికాప్టర్ నాగసాకి విమానాశ్రయానికి చెందినది కాగా, మరోకటి టొకుషిమా విమాన స్థావరానికి చెందినది. శిక్షణలో పాల్గొన్న మూడో హెలికాప్టర్ పైలట్‌ను అధికారులు ప్రమాదంపై వివరాలు ఆరా తీశారు. ఈ ఎస్‌హెచ్ 60 కె విమానాలు యాంటీ సబ్‌మెరైన్ నౌకలను ధ్వంసం చేస్తాయి. ఇతర కార్యకలాపాలకు కూడా వీటిని వినియోగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News