ఆర్‌టిసి బస్సు ప్రైవేటు డ్రైవర్‌పై ఒక ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్‌లో సోమవారం చోటు చేసుకుంది. ప్రయాణికుడి చర్యను నిరసిస్తూ వికారాబాద్ ఆర్‌టిసి డిపోకు చెందిన కార్మికులు 27 ప్రైవేట్ బస్సులను నిలిపి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములు పై నవాజ్ అనే వ్యక్తి దాడి చేశాడు. బస్సు ఆలస్యంపై డ్రైవర్‌ను నవాజ్ ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము భోజనం చేస్తున్నామని, ఐదు నిమిషాల్లో బయలుదేరుతామని డ్రైవర్, కండక్టర్ సర్దిచెప్పినా వినకుండా దాడి చేయడానికి ప్రయత్నించాడు.
ఆగ్రహంతో డ్రైవర్ రాములుపై నవాజ్ దాడి చేశాడు. ఈ క్రమంలో నిందితుడు నవాజ్‌పై చర్యలు తీసుకోవాలని బస్సులు నిలిపి ఆర్‌టిసి కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రైవేటు బస్సుల డ్రైవర్లు ఉదయం నుంచి పరిగి వికారాబాద్, తాండూర్, హైదరాబాద్ వెళ్లే బస్సులను బంద్ చేసి నిరసన తెలిపారు. దాడి ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఆర్‌టిసి డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆర్‌టిసి బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితుడిని అరెస్టు చేశామని సిఐ నాగరాజు తెలిపారు. ఎవరైనా ఆర్‌టిసి ఉద్యోగులపై దాడి చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు.