Monday, December 23, 2024

ఆరోగ్య ధీమా!

- Advertisement -
- Advertisement -

దేశంలో బీమా రంగాన్ని నియంత్రిస్తున్న భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎ)కు ఇది రజతోత్సవ సంవత్సరం. 2000వ సంవత్సరం ఏప్రిల్ 19న ఏర్పాటైన ఈ సంస్థ, విస్తృత సేవలను అందిస్తూ బీమా రంగంలో తనదైన ముద్ర వేసింది. రజతోత్సవ సంవత్సరంలోకి అడుగిడుతూ ఐఆర్‌డిఎ మోసుకొచ్చిన ఓ శుభవార్త లక్షలాది ఆరోగ్య బీమా పాలసీదారులపై పన్నీటి జల్లు చిలకరించింది. మరెంతో మందికి ఆరోగ్య బీమా పట్ల ధీమా కల్పించింది. ఆరవై ఐదు ఏళ్లు దాటినవారికి కూడా ఆరోగ్య బీమా సౌకర్యం వర్తింపజేస్తూ ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం వయో వృద్ధులకు ఓ వరంలాంటిది.

పింఛను పొందుతూ, దాంతోపాటే ప్రభుత్వం అందజేసే ఆరోగ్య బీమా సౌకర్యాలను అందుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగుల సంగతి అలా ఉంచితే, ప్రైవేటు, అసంఘటిత రంగాల్లో పని చేసి రిటైరైన వృద్ధులకు సమాజంలో ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనాలూ లేవనే చెప్పాలి. పింఛను రాకపోగా, రోగమో రొష్టో వస్తే చేతినించి డబ్బులు ఖర్చు చేయాల్సిన దుస్థితి వారిని కుంగదీస్తోంది. నిబంధనల ప్రకారం 65 ఏళ్లు దాటితే బీమా సంస్థలేవీ వృద్ధులకు పాలసీలు ఇవ్వవు. వృద్ధుల పాలిట అశనిపాతంలా ఉన్న ఈ నిబంధనకు తిలోదకాలు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇన్నాళ్లకయినా ఐఆర్‌డిఎ కళ్లు తెరిచి, వయసుతో నిమిత్తం లేకుండా పాలసీ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం.

దీని వల్ల ప్రీమియం పెరగవచ్చునేమోగానీ, చాలా మంది వృద్ధులకు కలిగే ప్రయోజనాలు అంతకుమించినవే. దీంతోపాటే ఐఆర్‌డిఎ మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్ వంటి మహమ్మారి వ్యాధులతో బాధపడేవారికి పాలసీలు ఇవ్వలేమని ఆయా ఆరోగ్య బీమా సంస్థల ప్రతినిధులు కచ్చితంగా చెబుతూ ఉంటారు. ఇకపై ఇలాంటి వివక్షాపూరిత సేవలకు చరమాంకం పాడుతూ, ఏ జబ్బుతో బాధపడుతున్నప్పటికీ పాలసీ అందించాలంటూ బీమా కంపెనీలను ఐఆర్‌డిఎ ఆదేశించింది. ఆరోగ్య బీమా తీసుకున్నాక, అన్ని రకాల వ్యాధులకూ అది వర్తించేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న 48 నెలల వెయిటింగ్ పీరియడ్‌ను కూడా 36 నెలలకు తగ్గించడం హర్షించదగిన మరో పరిణామం. దీనివల్ల వివిధ రకాల రోగాలతో బాధపడే పాలసీదారులకు సాంత్వన చేకూరుతుందనడంలో సందేహం లేదు.

పాలసీ తీసుకునే సమయంలో పాలసీదారు తన జబ్బుల గురించి వెల్లడించని పక్షంలో అనేక బీమా కంపెనీలు క్లెయిములను తిరస్కరిస్తున్న దాఖలాలు కోకొల్లలు. ఇలాంటి వైఖరికి ఐఆర్‌డిఎ చెక్ పెడుతూ పాలసీదారు తన జబ్బు గురించి చెప్పినా చెప్పకపోయినా, పాలసీ తీసుకున్న 36 నెలల తర్వాత అన్ని జబ్బులకూ బీమా ఇచ్చి తీరాలని స్పష్టం చేయడం కూడా పాలసీదారుల నెత్తిన పాలు పోసినట్టే. బీమా పథకంలోని అన్ని సేవలూ అందాలంటే వరసగా ఎనిమిదేళ్లపాటు ప్రీమియం చెల్లించాలన్నది ఇప్పటివరకూ అమలులో ఉన్న నిబంధన కాగా, ఈ మారటోరియాన్ని ఐదేళ్లకు ఐఆర్‌డిఎ తగ్గించింది. బీమా చట్టం 1938లోని సెక్షన్ 114ఎ కింద నిబంధనలు రూపొందించే అధికారాలను కట్టబెడుతూ 2000వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రాణం పోసింది.

అప్పటి నుంచి అవసరాలకు అనుగుణంగా, పరిస్థితులకు తగినట్లుగా మార్పులు చేర్పులూ చేస్తూ బీమా చట్టాన్ని ఈ సంస్థ పటిష్టం చేసింది. విదేశీ బీమా కంపెనీలకు రెడ్ కార్పెట్ పరచడం, బీమా సేవలను విస్తృతం చేయడం, ఆన్ లైన్ సౌకర్యం కల్పించడం వంటి నిర్ణయాలతో ఐఆర్‌డిఎ దేశ ప్రజలకు బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తోంది. సేవా భావంతో మెలగవలసిన బీమా సంస్థలు క్లెయిముల విషయంలో నిబంధనలను సాకుగా చేసుకుని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాయి.

ఆస్పత్రిలో 24 గంటలు లేరనో, పాలసీ తీసుకునే సమయంలో జబ్బు గురించి ప్రస్తావించలేదనో సాకులు చెప్పి క్లెయిములను తిరస్కరిస్తూ ఉంటాయి. ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాలూ, వినియోగదారుల ఫోరాలు ఎన్నిమార్లు చీవాట్లు పెట్టినా, కుక్కతోక వంకరే అన్నట్లు ఆయా సంస్థలు తీరు మార్చుకోవడానికి ఇచ్చగించవు. ఐఆర్‌డిఎ తాజా నిర్ణయాలతో అలాంటి సంస్థలు ముకుతాడు పడుతుందని భావించవచ్చు. ఐఆర్‌డిఎ తీసుకున్న నిర్ణయాలతో బీమా సౌకర్యం మరింత మందికి అందుబాటులోకి వస్తుందని, బీమా కంపెనీలు వైవిధ్యభరితమైన సేవలు అందిస్తాయని ఆశించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News