అఫిడవిట్‌లో పేర్కొన్న గుంటూరు అభ్యర్థి పి చంద్రశేఖర్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికలలో గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 5,785 కోట్ల స్థిర చరాస్తులను ప్రకటించి వార్తా పత్రికల పతాక శీర్షికలకు ఎక్కారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల బరిలో పోటీచేస్తున్న అత్యంత సంపన్నులలో ఒకరిగా చంద్రశేఖర్ నిలిచారు. తన వ్యక్తిగత ఆస్తులను రూ. 2,4448.72 కోట్లుగా చంద్రశేఖర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య శ్రీరత్న కోనేరు పేరిట రూ. 2.348.78 కోట్ల ఆస్తులను ఆయన చూపించారు.
తన పిల్లల పేరిట రూ. 1,000 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, తొలి దశ లోక్‌సభ ఎన్నికలలో బరిలో నిలిచిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ తన ఆస్తులను దాదాపు 717 కోట్లుగా చూపించి అత్యంత పంపన్న అభ్యర్థిగా నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) ఇదివరకు ఒక ప్రకటనలో తెలిపింది. చంద్రశేఖర్ కుటుంబానికి రూ. 1,138 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. అమెరికాలోని మోర్గన్ చేస్ బ్యాంకులటో లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఆయనకు ఈ రుణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ-సినాయ్ హాస్పిటల్‌లో ఫిజీషియన్ టీచర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఫండింగ్ వరల్డ్(ఆన్‌లైన్ లెర్నింగ్ అండ్ స్టడీ రిసోర్సెస్ ప్లాట్‌ఫామ్) దాకా ఆయన ఎదిగారు.
1999లో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎంబిబిఎస్ పూర్తి చేసిన చంద్రశేఖర్ పెన్సిల్వేనియాలోని జీసింగర్ మెడికల్ సెంటర్ నుంచి ఎండి(ఇంటర్నల్ మెడిసిన్) పూర్తి చేశారు. ఎంసెట్(ఎంబిబిఎస్)లో ఆయనకు 27వ ర్యాంకు వచ్చింది. తనకు అమెరికాకు చెందిన అనేక సంస్థలలో షేర్లు, పెట్టుబడులు ఉన్నట్లు ఆయన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడీజ్ బెంజ్, టెస్లా వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కె వెంటక రోశయ్య ఉన్నారు.