వారసత్వ పన్ను న్యాయమే అన్న పిట్రోడా
అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్న కాంగ్రెస్
కాంగ్రెస్‌పై విరుచుకుపడిన బిజెపి
న్యూఢిల్లీ : ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ (ఐఒసి) చైర్‌పర్సన్ శామ్ పిట్రోడా ఒక వ్యాఖ్యతో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశారు. కాంగ్రెస్ ‘సంపద పునఃపంపిణీ’ ఎన్నికల వాగ్దానంపై రాజకీయ వివాదం నెలకొన్న నేపథ్యంలో శామ్ పిట్రోడా భారత్‌లో యుఎస తరహా ‘వారసత్వ పన్ను’ విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. పిట్రోడా వ్యాఖ్యలతో తనకు సంబంధం కాంగ్రెస్ స్పష్టం చేయగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించింది.
‘పిట్రోడా ‘ఎఎన్‌ఐ’కి ఇచ్చిన ఇంటర్వూలో కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాన్ని సమర్థించారు. సంపద పునఃపంపిణీ విధానం ప్రజల ప్రయోజనం కోసమే అని, అత్యంత సంపన్నుల ప్రయోజనార్థం కాదని ఆయన అన్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న వారసత్వ పన్ను విధానం గురించచి పిట్రోడా వివరిస్తూ, ‘ఒకరికి 100 మిలియన్ డాలర్లు విలువ చేసే సంపద ఉన్నట్లయితే అతను మరణించినప్పుడు సుమారు 45 శాతాన్ని తన పిల్లలకు బదలీ చేయగలడు. తక్కిన 55 శాతం ప్రభుత్వం పరం అవుతుంది. అది ఆసక్తికరమైన ఒక చట్టం.
దాని ప్రకారం, మీ తరంలో మీరు సంపద కూడబెట్టినట్లయితే, మీరు నిష్క్రమించిన పక్షంలో మొత్తంగా కాకుండా అందులో సగాన్ని ప్రజల కోసం వదలివేయాలి. అది నాకు న్యాయంగానే కనిపిస్తోంది’ అని చెప్పారు. ‘భారత్‌లో అలా ఉండదు. ఎవరి ఆస్తి అయినా 10 బిలియన్‌లు అయినట్లయితే, అతను మరణించినప్పుడు అతని పిల్లలకు ఆ 10 బిలియన్లు అందుతాయి. ప్రజలకు ఏమీ లభించదు& కనుక జనం చర్చించవలసిన తరహా అంశాలు ఇవి’ అని పిట్రోడా అన్నారు. ‘బుజ్జగింపు రాజకీయాలు’గా కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొనడాన్ని పిట్రోడా ఆక్షేపిస్తూ, ‘అలా ఆలోచించడం అమాయకత్వం& ఆయన మెదడు గురించి నాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి’ అని చెప్పారు. సంపద పంపిణీ ‘విధానపరమైన అంశం’ అని పిట్రోడా అంటూ, భారత్‌లో ‘కనీస వేతన విధానం’ ఉండడం అవసరమని నొక్కిచెప్పారు.
‘వారసత్వ పన్ను’ గురించి పిట్రోడా వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వాటిని సంచలనాత్మకం చేయడం ప్రధాని మోడీ ‘దురుద్దేశపూర్వక’ ఎన్నికల ప్రచారం నుంచి దృష్టి మళ్లించే యత్నమే అని పార్టీ విమర్శించింది. పిట్రోడా ఒక మెంటార్, మిత్రుడు, ఫిలాసఫర్, ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శకుడు అని, ఆయన భారత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ పేర్కొన్నారు. ‘తాను తీవ్రంగా భావించిన అంశాలపై పిట్రోడా స్వేచ్ఛగా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి తన వ్యక్తిగత అంశాలను చర్చిందే, వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుంది’ అని రమేష్ ’ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘పిట్రోడా అభిప్రాయాలు సదా భారత జాతీయ కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబిస్తుంటాయని దీనికి అర్థం కాదు. చాలా సార్లు అలా జరగదు. ఆయన వ్యాఖ్యలను సంచలనాత్మకం చేయడం, అసందర్భంగా విమర్శించడం నరేంద్ర మోడీ తప్పుడు ఎన్నికల ప్రచారంపై నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నమే’ అని రమేష్ అన్నారు. తన వ్యాఖ్యలు వివాదం సృష్టించడంతో ‘ఒక వ్యక్తిగా నేను యుఎస్‌లోని వారసత్వపన్ను గురించి అన్న మాటలను కాంగ్రెస్ మేనిఫెస్టోపై పిఎం వ్యాప్తి చేస్తున్న అబద్ధాల నుంచి దృష్టి మళ్లించేందుకు గోడీ మీడియా వక్రీకరించడం దురదృష్టకరం. కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీ విధానానికీ దీనితో సంబంధం లేదు’ అని పిట్రోడా ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.