Friday, December 20, 2024

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

- Advertisement -
- Advertisement -

ఫస్టియర్‌లో 60.01 శాతం,
సెకండియర్‌లో 64.19 శాతం ఉత్తీర్ణత
మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడులయ్యాయి. ఈ పరీక్షల్లో మొదటి సంవత్సరం 60.01 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సరం 64.19 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. ఈసారి ఫలితాల్లో బాలికలదే పై చేయి. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 68.35 శాతం మంది బాలికలు ఉత్తీర్ణతను సాధించగా, సెకండియర్‌లో 72.53 శాతం బాలికలు పాస్ అయ్యారు.

మరోవైపు ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 51.5 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించగా, రెండో ఏడాది 56.1 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బుధవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా, పరీక్షల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు 4,30,413 మంది విద్యార్థులు రాయగా, 2,62,829 మంది ఉత్తీర్ణులు కాగా, 60.5 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సరంలో 4,01,445 మంది పరీక్షలు రాయగా, 2,78,856 మంది ఉత్తీర్ణులు కాగా, 64.8 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ప్రథమ సంవత్సరం ఫలితాలలో జనరల్‌లో 1,70,212 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా, 60,713 మంది బి గ్రేడ్, 23,650 సి గ్రేడ్, 8,254 మంది డి గ్రేడ్ సాధించారు.

ఒకేషనల్‌లో 15,813 మంది మంది విద్యార్థులు ఎ గ్రేడ్, 8,272 మంది బి గ్రేడ్, 318 మంది సి గ్రేడ్, 29 మంది డి గ్రేడ్ సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌లో 1,77,019 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా,27 మంది ప్రైవేట్ విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించారు. రెగ్యులర్‌లో 68,378 మంది, ప్రైవేట్‌లో 25 మంది బి గ్రేడ్, రెగ్యులర్‌లో 25,478 మంది, ప్రైవేట్‌లో 16 మంది సి గ్రేడ్, రెగ్యులర్‌లో 7,981 మంది, ప్రైవేట్‌లో 16 మంది డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్‌లో రెగ్యులర్‌లో 17,265, ప్రైవేట్‌లో 31 ఎ గ్రేడ్ సాధించగా, బి గ్రేడ్‌లో 9,600 మంది, సి గ్రేడ్‌లో రెగ్యులర్‌లో 465,డి గ్రేడ్‌లో రెగ్యులర్‌లో 16 మంది ఉత్తీర్ణత సాధించారు.

బాలికలదే పైచేయి
ఇంటర్ ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 60.01 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 68.35 శాతం నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 64.19 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 72.53 శాతం నమోదైంది. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 2,17,716 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 1,49,331 ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 23,966 మంది బాలికలు హాజరు కాగా, 15,859 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 2,12,697 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, 1,13,498 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 24,344 మంది హాజరుకాగా, 8,573 మంది ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సరంలో జనరల్‌లో 2,05,381 మంది బాలికలు హాజరు కాగా, 1,55,5000 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 1,96,064 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, 1,23,356 మంది ఉత్తీర్ణులయ్యారు.

గురుకుల కళాశాలల్లో మెరుగైన ఫలితాలు
ఇంటర్ ఫలితాలలో గురుకుల కళాశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. బిసి గురుకులాల్లో ప్రథమ సంవత్సరంలో 71.35 శాతం, ద్వితీయ సంవత్సరంలో 82.87 ఫలితాలు నమోదు కాగా, టిఎస్‌ఆర్‌జెసిలో ప్రథమ సంవత్సరంలో 56.84 శాతం, ద్వితీయ సంవత్సరంలో 92.53 శాతం ఫలితాలు నమోదయ్యాయి. అలాగే సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 75.85 శాతం, ద్వితీయ సంవత్సరంలో 83.23 శాతం ఫలితాలు నమోదు కాగా, ఎస్‌టి గురుకులాల్లో 69.77 శాతం, 81.52 శాతం, మైనార్టీ గురుకులాల్లో ఫస్టియర్‌లో 72.84 శాతం, సెకండియర్‌లో 83.65 శాతం ఫలితాలు నమోదయ్యాయి. మోడల్ స్కూళ్లలో ఫస్టియర్‌లో 50.32 శాతం, సెకండియర్‌లో 65.42 శాతం, కెజిబివిలలో ఫస్టియర్‌లో 67.19 శాతం, సెకండియర్‌లో 77.42 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 38.21 శాతం, ద్వితీయ సంవత్సరంలో 49.13 శాతం, ప్రైవేట్ ఎయిడెడ్‌లో ప్రథమ సంవత్సరంలో 44.95 శాతం , ద్వితీయ సంవత్సరంలో 45.56 శాతం ఉత్తీర్ణత నమోదయ్యాయి.

ఫస్టియర్ రంగారెడ్డి, సెకండియర్‌లో ములుగు జిల్లాలు టాప్
రాష్ట్ర ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71.7 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా, 71.58 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ద్వితీయ స్థానంలో, ములుగు జిల్లా 70.01 శాతం ఉత్తీర్ణతతో తృతీయ స్థానంలో నిలిచాయి. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 34.81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా సెకండియర్ ఫలితాల్లో 82.95 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లాకు ప్రథమ స్థానం, 79.31 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లాకు ద్వితీయ స్థానం, 77.63 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లాకు తృతీయ స్థానం దక్కాయి.కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 44.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఎంపిసిలో అత్యధిక ఉత్తీర్ణత నమోదు
ఇంటర్మీయేట్ ఫలితాలలో గ్రూపుల వారీగా ఎంపిసిలో 68.52 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బైపిసిలో 67.34 శాతం, సిఇసిలో 41.73 శాతం, హెచ్‌ఇసిలో 31.57 శాతం, ఎంఇసిలో 50.51 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా సెకండియర్ ఎంపిసిలో 73.85 శాతం,బైపిసిలో 67.52 శాతం, సిఇసిలో 44.81 శాతం, హెచ్‌ఇసిలో 43.51 శాతం, ఎంఇసిలో 59.93 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు.

మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజును గురువారం(ఏప్రిల్ 25) నుంచి మే 2వ తేదీలోపు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే రీ వ్యాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ కోసం మే 2వ తేదీలోగా ఫీజు చెల్లించాలని అన్నారు. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.100, స్కాన్ చేసిన జవాబు పత్రాలు, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.600 చెల్లించాలని పేర్కొన్నారు.

సందేశాలు నివృతికి ఈ నెంబరుకు కాల్ చేయండి
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎలాంటి సందేశాలు ఉన్నా helpdesk- ie@telangana.gov.inకి ఈమెయిల్ చేస్తే మీ సందేహాలు నివృత్తి అవుతాయి. లేకపోతే 040 24655027కి ఫోన్ చేయవచ్చు. కొంత మంది విద్యార్థులు పాసు కాలేదని, తక్కువ మార్కులు వచ్చాయని ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని, అలాంటి వారు ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకోకుండా తర్వాత ఏం చేయాలో ఆలోచించాలని విద్యాశాఖ సూచించింది. ఇలాంటి విద్యార్థుల కోసం టెలీమానస్ అనే సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 14416 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే విద్యార్థులకు కావాల్సిన మానసిక ఉత్సాహాన్ని సైకాలజిస్ట్‌లు అందిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News