Friday, December 20, 2024

యాదాద్రికి గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ అయ్యింది. యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. గత కొంత కాలం నుండి సిద్ధంగా ఉండి అనుమతులకోసం జెన్‌కో ఎదురు చూస్తోంది. అయితే కేంద్ర అటవీ ప ర్యావరణ శాఖ అనుమతి ఇవ్వడంతో ఇక విద్యుత్ ఉత్పత్తికి జెన్‌కో సన్నాహాలు చేస్తోంది. అయితే మొదటి విడతగా 800 మెగా వాట్లను ఉత్పత్తి చేసే రెండు యూనిట్లతో 1600 మెగా వాట్ల విద్యుత్‌ను జెన్‌కో ఉత్పత్తి చేయనుంది. ఆ తర్వాత రెండవ విడతలో 800 మెగా వాట్ల మూడు యూనిట్లతో 2400 మెగా వాట్ల ఉత్పత్తి మొత్తంగా 4000 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటయింది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నల్లగొండ జిల్లా దామరచర్లలోని వీర్లపాలెంలో నిర్మించారు. 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దీని సామర్థ్యం. రూ.30 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ పవర్ ప్లాంటు దక్షిణ భారతదేశంలోని రెండో అతిపెద్ద విద్యుత్ కేంద్రం.

2015, జూన్ 8న అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దీనికి భూమి పూజ చేశారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించనున్న ఈ ప్లాంట్‌కు జూన్ 26, 2017లో కేంద్ర పర్యావణ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో రూ. 29వేల కోట్ల రూపాయతో జెన్‌కో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రయివేటు ఎజెన్సీలకు ఈ పనులు కట్టబెట్టకుండా ఆనాడు కెసిఆర్ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థ బిహెచ్‌ఇఎల్‌కు ఆ నిర్మాణ పనుల బాధ్యతలను అప్పగించింది. నిర్మాణ పనులు పూర్తవుతుండగా ఈ ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తి చేపడితే నల్లమల అభయారణ్యంలో ఉన్న ప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని దీని అనుమతులు రద్దు చేయాలని కోరుతూ ముంబయికి చెందిన కన్జర్వేటీవ్ యాక్షన్ ట్రస్ట్, విశాఖపట్నంకు చెందిన సమత అనే స్వచ్ఛంధ సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఎన్జీటీ యాదాద్రి అనుమతులపై స్టే విధించింది.

వన్య ప్రాణులకు ఏర్పడే ముప్పుపై అధ్యయనం చేసి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అయితే కేంద్ర ప్రభుత్వం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేయకుండా జాప్యం చేసింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగింది. అనుకున్న గడువులో ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. కేంద్ర పర్యావరణ శాఖ జాప్యం చేస్తోంది.. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ తో సంబంధం లేకుండా విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని జెన్‌కో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేసింది. జెన్‌కో పిటిషన్ స్వీకరించిన గ్రీన్ ట్రిబ్యునల్ తాజాగా పర్యావరణ అనుమతికి అవసరమైన టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌పై నివేదిక పంపాలని ఆదేశించింది. యాదాద్రికి ఎంత దూరంలో అంటే ఏరియల్ డిస్టెన్స్ ఎంత ఉందో తెలియజేయాలని జెన్కోను పర్యావరణ శాఖ ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు రాష్ట్ర అటవీ శాఖ సైతం సర్వే జరిపి అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ యాదాద్రి ప్లాంట్ కు 14.3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెల్చి చెప్పింది.

ఈ నివేదిక అనుసరించి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సానుకూలతను వ్యక్తం చేస్తూనే గతంలో పర్యావరణ అనుమతులకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేశారని, అది కాకుండా మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేసి పంపాలని సూచించింది. విద్యుత్ శాఖకు ముఖ్య కార్యదర్శిగా సయ్యద్ ముర్తజా ఆలీ రిజ్వీ బాధ్యతలు చేపట్టడంతో యాదాద్రి అనుమతి వ్యవహారం వేగంగా సాగింది. యాదాద్రి ప్లాంట్ వద్దే ఉంటూ రిజ్వి తనదైన శైలిలో పనులు వేగంగా సాగేలా వ్యవహరం నడిపారు. కేంద్రం సూచించిన ప్రకారం మరో విడత ప్రజాభిప్రాయ సేకరణ చేసి పంపండతో తాజాగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ యాదాద్రి పవర్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి ప్రాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తే మరో నాలుగు వేల మెగావాట్ల అదనపు విద్యుత్పత్తి అందుబాటులోకి రానుంది. దీంతో ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనే పరిస్థితి ఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News