Friday, December 20, 2024

ప్రియాంకపై పోటీకి నో చెప్పిన వరుణ్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా పరిగణించే రాయబరేలి లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని ఊహాగానాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో తన సోదరికి ప్రత్యర్థిగా బరిలో దిగడానికి బిజెపి ఎంపి వరుణ్ గాంధీ నిరాకరించినట్లు బిజెపి వర్గాలు గురువారం వెల్లడించాయి. 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయబరేలి నుంచి వరుణ్ గాంధీని బరిలోకి దించాలని బిజెపి ఆసక్తిని చూపతున్నట్లు వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఎన్నికలలో రాయబరేలి నుంచి తాను పోటీచేయబోనంటూ ప్రకటించిన సోనియా గాంధీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నిక కావడంతో తన తల్లి వారసురాలిగా ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రియాంక పోటీ చేసిన పక్షంలో గాంధీ కుటుంబం నుంచే మరో వ్యక్తిని ప్రత్యర్థిగా దించాలని భావించిన బిజెపి నాయకత్వం వరుణ్ గాంధీని సంప్రదించిందని,

అయితే గాంధీ కుటుంబం మధ్య పోటీని ఇష్టపడని వరుణ్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారని వర్గాలు తెలిపాయి. పిలిభిత్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీకి బిజెపి ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆ స్థానాన్ని నిరాకరించి అక్కడి నుంచి కేంద్ర మంత్రి జితిన్ ప్రసాదను బరిలోకి దించింది. దీంతో మనస్తాపం చెందిన వరుణ్ గాంధీ తాను ఎప్పటికీ పిలిభిత్ బిడ్దనేనని నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వరుణ్ తల్లి మేనకా గాంధీకి మాత్రం ఆమె సిట్టింగ్ స్థానం సుల్తాన్‌పూర్‌ను బిజెపి కేటాయించడం గమనార్హం. రాయబరేలిలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తే ఆమెకు దీటైన ప్రత్యర్థి కోసం బిజెపి అన్వేషణ సాగిస్తోంది. కాగా..ఏప్రిల్ 30 లోపల రాయబరేలి అభ్యర్థిపై బిజెపి ప్రకటన చేసే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనున్నది. అదే రోజున రాయబరేలి, అమేథీ సీట్లకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News