గడిచిపోయిన 2023 సంవత్సరం అత్యంత దుర్భిక్ష ఆకలికేకల నామ సంవత్సరం అయింది. ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలలోని దాదాపు 28 కోట్ల ఇరవై లక్షల మంది జనం తీవ్రస్థాయి ఆకలిని ఎదుర్కొన్నారు. ఇందులో యుద్ధ పీడిత గాజాస్ట్రిప్ ప్రాంతం ప్రజానీకం తీవ్రస్థాయి దుర్భిక్షం ఎదుర్కొన్నారు. ఓ వైపు బాంబులు, రాకెట్లు , క్షిపణుల దాడుల నడుమ , మరో వైపు చాలీచాలని తిండిగింజల కటకటల మధ్య బతుకు నరకం అయి బాధలు పడ్డారు. ఐరాస ఆధ్వర్యపు ప్రపంచ ఆహార సంక్షోభాల గ్లోబల్ రిపోర్టులో ఈ చేదునిజాలు వెలువడ్డాయి. ఐరాస ఈ నివేదికను బుధవారం వెలువరించింది. గురువారం ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. 2022తో పోలిస్తే మరుసటి సంవత్సరంలో అత్యధికంగా దాదాపు రెండు కోట్ల 40 లక్షల మందికి పైగా ఆకలి సమస్యతో తల్లడిల్లారు. కోట్లాది మందికి సరైన ఆహార భద్రత లేకుండా పోయింది.
గాజాస్ట్రిప్ ఈ బాధాకర జాబితాలో కీలక స్థానంలో నిలిచింది. సూడాన్ కూడా ఆకలి సమస్యలతో తల్లడిల్లిందని వెల్లడించారు. ఇక ఆహార సంక్షోభ తీవ్రతల పర్యవేక్షణ చేయాల్సిన దేశాల జాబితాలో గడిచిన రెండు సంవత్సరాల వ్యవధిలో మరిన్ని దేశాలను చేర్చాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆకలి దప్పుల బాధిత జాబితా మరింత విస్తరించకుని పోయింది. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టోరెరో తెలియచేసిన వివరాల ప్రకారం దాదాపు 5 దేశాలలో ఇప్పుడు దుర్భిక్షం దీని తాలూకు ఆకలి దప్పుల సంక్షోభం ప్రమాదఘంటికలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ ప్రమాదకర స్థాయిని ఫేజ్ 5గా వ్యవహరిస్తారు. ఈ ఫేజ్ 5లె ఇప్పుడు ఆయా దేశాలకు చెందిన 7,05,000 మందికి పైగా పేదజనం వచ్చి చేరారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కరవు కాటకాలు, దీని దరిమిలా తలెత్తే ఆకలి దారుణ పరిస్థితులను లెక్కకట్టేందుకు అంతర్జాతీయ నిపుణులు తగు సూచీలను కొలమానాలను ఖరారు చేసుకుని ఉన్నారు.
ఈ క్రమంలో ఆకలి సమస్యలపై 2016 నుంచి నివేదికలు అందిస్తూ వస్తున్న తరువాత చూస్తే ఇప్పుడు అప్పటికీ ఇప్పటికీ బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగిందని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న వాఇలో దాదాపు 80 శాతం వరకూ అంటే 5,77,000 మంది వరకూ అనివార్యపు కరువుకాటకాల పరిస్థితిని దయనీయ రీతిలో చవిచూడాల్సి వచ్చింది. ప్రత్యేకించి యుద్ధం వారికి చితిమంటలతో పాటు ఆకలి మంటలను కూడా చేర్చింది. గాజా తరువాతి క్రమంలో నిరంతర ఆకలి తీవ్రతను ఎదుర్కొంటున్న దేశాలలో దక్షిణ సూడాన్, బర్కినా ఫాసో, సోమాలియా, మాలి వంటి దేశాలు ఉన్నాయి. వేలాది మంది ఆయా దేశాలలో ఆకలి దప్పులతో సతమతమవుతున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇప్పుడు ఏడవ నెలలోకి చేరుకున్న దశలో గాజాస్ట్రిప్‌లో కోటికి పైగా, సూడాన్‌లో 80వేల వరకూ వచ్చే జూలై నాటికి మరింత కటకట పరిస్థితిని చవిచూడాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఇక వాతావరణ పరిస్థితులు కూడా కరువు బాధలను ఇనుమడింపచేశాయి. ఈ ఏడాది ఆరంభ దశలో నెలకొని ఉంటూ వస్తూన్న ఎల్‌నినో పరాకాష్ట దశతో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు, వరదలు, తూర్పు ఆఫ్రికా దేశాలలో స్వల్ప వర్షాలు, దక్షిణాఫ్రికాలో కరువు పరిస్థితులు దాపురించాయి. దీని ప్రభావం ప్రత్యేకించి మలావి, జాంబియా, జింబాబ్వేలపై ఈ ఏడాది అంతా పడుతుందని నివేదికలో విశ్లేషించారు.
మానవ వైఫల్యాలతో ఆకలిచావులు
ఐరాస అధినేత ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన
పలు విధాలుగా మనుష్యులు చేస్తున్న తప్పిదాలకు ఇప్పుడు నిరుపేదలు , అన్నెం పున్నెం తెలియని పసికందులు, బాలలు బలి కావల్సి వస్తోంది. ఆలనా పాలనా చూసుకోలేని తల్లిదండ్రులతో భావితరాలకు ఈ ప్రపంచం ఆకలి ప్రపంచం అయి కూర్చుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళనాయుత చురకలు పెట్టారు. ఇప్పటి నివేదిక వల్లనైనా మేలుకొలుపు ఉంటుందా? అని ప్రశ్నించారు. అసంఖ్యాక పిల్లలు ఆకలితో పాలలేమితో అసువులు బాసే ప్రపంచం వచ్చిందని వ్యాఖ్యానించారు. గడిచిన 12 నెలలుగా ఎక్కడో ఓ చోట తలెత్తి అంతులేని రీతిలో సాగుతున్న ఘర్షణలతో విపత్కర పరిస్థితులు దాపురించాయని తెలిపారు. ప్రత్యేకించి గాజాస్ట్రిప్ ఘర్షణ పరిస్థితిని దారుణం చేసిందని , అక్కడ తీవ్రస్థాయిలో మానవకల్పిత ఆకలి కేకలు ఏర్పడ్డాయని విమర్శించారు. ఇది ఉపద్రవాలను మించిన ఉపద్రవం అన్నారు.
సూడాన్ అంతర్గత సంక్షోభంతో ప్రపంచస్థాయి నిర్వాసిత సంక్లిష్టత ఏర్పడింది. దీనితో తలెత్తిన పరిణామాలు ఆహారలోపాలకు దారితీశాయి. ఇప్పుడు కనీసం దక్కాల్సింది తిండి, బలవర్థకం పౌష్టికాహారం సంగతి తరువాతి విషయం అన్నారు. పలు కారణాలతో అప్ఘనిస్థాన్ కూడా ఇప్పుడు ఆకలి సమస్యల జాబితాలో చేరుతోంది. ప్రత్యేకించి ఆహార సరఫరాల వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడకుండా చూడాల్సి ఉంటుంది. ఎక్కడైతే తీవ్రస్థాయి సంక్షోభాలు నెలకొని ఉన్నాయో అక్కడి ప్రాంతాల వారికి వెనువెంటనే అంతర్జాతీయ స్పందనలతో ఆహార సరఫరా జరగాల్సి ఉంది. ఆకలి లేని ప్రపంచ స్థాయిని దాటి ఇప్పుడు సంక్షుభిత ప్రపంచ దశకు చేరాం. ఇప్పుడు నివారణ చర్యల సంగతి పక్కనపెడితే తక్షణ సహాయ స్పందన అత్యవసరం అని ఐరాస నేత తెలిపారు.