Friday, December 20, 2024

భార్య స్త్రీ ధనంపై భర్తకు హక్కు లేదు

- Advertisement -
- Advertisement -

భార్యకు చెందిన స్త్రీనిధిపై భర్తకు ఎటువంటి హక్కు లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఏదేనీ క్లిష్ట పరిస్థితుల్లో భర్త ఈ స్త్రీనిధిని తన అవసరాలకు లేదా కుటుంబానికి వాడుకుంటే దీనిని సదరు భార్యకు తిరిగి అణాపైసలతో సహా చెల్లించాల్సి ఉంటుంది. తిరిగి ఈ మొత్తం ఆమెకు అప్పగించాల్సిన నైతికబాధ్యత భర్తపై ఎంతైనా ఉందని తెలిపింది. కేరళకు చెందిన ఓ మహిళ తనకు పుట్టింటివారు ఇచ్చిన 89 గ్రాములు బంగారాన్ని భర్త తన అవసరాల మేరకు వాడుకున్నారని , తమ పుట్టింటివారు భర్తకు రెండు లక్షల రూపాయల మేర చెక్కు కూడా ఇచ్చారని తెలిపారు. ఏవో కారణాలు చెప్పి పెళ్లయిన తరువాత ఆయన తన బంగారం తీసుకుని వాడుకున్నాడని, తన అత్తగారు కూడా బెదిరించారని ఫ్యామిలీకోర్టుకు తెలిపింది. భర్త చేసింది తప్పేనని ఈ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే హైకోర్టు ఆ తరువాత భర్తకు అనుకూల తీర్పు ఇచ్చింది.

ఆమె నగలను ఆయన దుర్వినియోగపర్చినట్లు నిరూపించలేకపోయిందని తెలిపింది. దీనికి వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. స్త్రీధనం ఉమ్మడి ఆస్తికిందికి రాదు. ఆమెకు సొంతంగా సంక్రమించిన ఆస్తి లేదా నగలు, ధనాన్ని భర్త ఏ అవసరానికి అయినా వాడుకోరాదు. వాడుకున్నట్లు అయితే దీనిని తిరిగి తప్పనిసరిగా ఆమెకు చెల్లించుకోవల్సి ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది. మహిళకు పెళ్లికి ముందు కానీ , పెళ్లి దశలో కానీ , అప్పగింతలు లేదా ఆ తరువాతి దశల్లో ఏ రూపంలో అయినా స్త్రీ ధనంగా పుట్టింటి నుంచి ధనం అందితే , ఆస్తి అందితే అది నిర్థిష్టంగా ఆమెకే చెందుతుంది. ఆమె దీనిని తన ఇష్టానుసారంగా దీనిని వాడుకునే హక్కు పూర్తి స్థాయిలో సంతరించుకుని ఉందని , భర్తకు ఈ అధికారం లేదని తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News