Saturday, December 21, 2024

నోటాకే మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి

- Advertisement -
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కీకల పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల కన్నా నోటా(నన్ ఆఫ్ ది అబవ్)కు అధిక ఓట్లు వచ్చిన పక్షంలో ఆ స్థానం ఎన్నికను రద్దు చేసి తాజాగా ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై ఎన్నికల కమిషన్ నుంచి సమాధానాన్ని కోరుతూ సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీచేసింది. రచయిత, హక్కుల కార్యకర్త, స్ఫూర్తిదాయక వక్త శివ్ ఖేరా ఈ పిల్ దాఖలు చేశారు. 2013 సుప్రీం కోర్టు తీర్పు మేరకు నోటా ఆప్షన్‌ను ఎన్నికలలో ఓటర్లకు ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేందుకు ప్రతికూల ఓటింగ్ అవకాశం ఓటరుకు కల్పించాల్సిన అవసరం ఉందని 2013 నాటి తన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. తమను గురించి ఓటర్లు ఏమనుకుంటున్నారో రాజకీయ పార్టీలకు, వాటి అభ్యర్థులకు తెలుస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇవిఎంలలో నోటా ఆప్షన్‌ను కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాగా..తాజాగా శివ్ ఖేరా దాఖలు చేసిన పిల్‌పై సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇసికి నోటీసు జారీచేసింది. తాము నోటీసు జారీచేస్తామని, ఇది కూడా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విషయమేనని, ఎన్నికల కమిషన్ ఏం జవాబిస్తుందో చూద్దామని సిజెఐ చంద్రచూడ్ తెలిపారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని సూరత్‌లో ఇటీవల జరిగిన పరిణామాలను గోపాల్ శంకరనారాయణన్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొందరు నామినేషన్లు ఉపసంహరించుకోవడం, కొందరు పోటీ నుంచి తప్పుకోవడంతో బిజెపి అభ్యర్థిని పోలింగ్‌కు ముందే విజేతగా ప్రకటించిన పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని తాము దాఖలు చేసిన పిల్ చాలా ముఖ్యమైనదని సీనియర్ న్యాయవాది తెలిపారు.

పిల్‌లో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా పిటిషనర్ ప్రస్తావించారు. నోటా కన్నా తక్కువ ఓట్లను సాధించుకున్న అభ్యర్థిని ఐదేళ్లపాటు అన్ని ఎన్నికల నుంచి బహిష్కరించే విధంగా నిబంధనలు రూపొందించాలని ఇసిని ఆదేశించాలని పిటిషనర్ కోరారు.నోటాను కాల్పినిక అభ్యర్థిగా పేర్కొంటూ సరైన ప్రచారం కల్పించాలని కూడా పిటిషనర్ తన పిల్‌లో కోర్టును కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News