జమ్మూ కశ్మీర్‌లో గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఓ చోట భూమి ఉన్నట్లుండి కుంగిపోయింది. రాంబన్ ప్రాంతంలో జరిగిన ఈ ఆకస్మిక అంతుపట్టని పరిణామంలో దాదాపు 50 ఇండ్లు , ఓ విద్యుత్ కేంద్రం ధ్వంసం అయ్యాయి. సమాచారం అందగానే ఇక్కడికి భూగర్భ శాస్త్ర నిపుణుల బృందం తరలివెళ్లింది. భూమి లోపలికి కూరుకుపోవడానికి దారితీసిన కారణాలను అన్వేషిస్తోంది. కాగా జిల్లా అధికారుల బృందం ఒకటి ఇక్కడికి చేరుకుంది. స్థానిక ప్రజలకు పునరావాసం,
నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఈ ప్రాంతపు ఉన్నతాధికారి బసీర్ ఉల్ హక్ చౌదరి శుక్రవారం తెలిపారు. తమ ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతూ ఉండటం, భూమి కిందికి జారడంతో తాము భయాందోళనకు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఏదో జరుగుతున్నదని తెలియగానే ప్రజలు తమ ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికులను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు, సహాయక శిబిరాలకు తరలించారు. గూల్‌కు దారితీసే మార్గంతో సంబంధాలు తెగిపోయినట్లు రాంబన్ అధికారులు తెలిపారు.