Saturday, December 21, 2024

బడుగులపై మోడీ సర్జికల్ స్ట్రయిక్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా దేశాన్ని రిజర్వేషన్‌ల రహిత దేశంగా చేయాలన్నదే బిజెపి లక్షమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 400 సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడిచేయడానికి బిజెపి కుట్ర చేస్తోందని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల క్షేత్రంగా దేశ మూ లవాసులైన ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓబిసిలపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని బిజెపి ప్రధాని మోడీ నిర్ణయించారని ఆయన విమర్శించా రు. రిజర్వేషన్లు రద్దు కాకూడదంటే కాంగ్రెస్ గెలవాల్సిందేనని ఆయన అన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోడీ, అమిత్‌షా ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వివిధ కులాలు, వర్గాలు ఉంటే హిందువు లు ఏకతాటి మీదకు రారని, రిజర్వేషన్లు రద్దు చేస్తే, హిందువులంతా ఒకటే అన్న భావన కలుగుతుందని ఆ పార్టీ భావిస్తోందన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారులతో మోడీ దోస్తీ కట్టారని, కార్పొరేట్ శక్తులు మనల్ని కట్టుబానిసలుగా చేసే కుట్ర జరుగుతోందని సిఎం అన్నారు. మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ అజెండా
2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి వందేళ్లవుతుందని, అప్పటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని, ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోందని సిఎం రేవంత్ విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరమని, అందుకే 400 సీట్లలో గెలిపించాలని (తరువాయి 6లో)
(మొదటిపేజీ తరువాయి)
మోడీ పదేపదే ప్రజలను కోరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని కులాలకు జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో బిసిలు 50శాతానికి పైగా ఉన్నారని, జనగణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని సిఎం రేవంత్ గుర్తు చేశారు. ఈ దేశ రాజకీయాలను, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అంశంపై విస్పష్టంగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అప్పట్లో మండల కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారని, మండలి కమిషన్ సిఫార్సు మేరకు బిసిలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. విపి సింగ్ ప్రభుత్వ హయాంలో బిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆయన తెలిపారు.

దేశ సార్వభౌమాధికారంపై మోడీ, అమిత్ షా దాడి
ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతో ఇవాళ అమిత్ షా, మోడీ దేశ సార్వభౌమాధికారం మీద దాడిచేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. అందులో భాగంగానే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకున్నారన్నారు. అందుకోసం మూడింట్లలో రెండు వంతుల మెజారిటీ వారి సొంతంగా ఉంటే, మిగిలిన రాష్ట్రాల్లో శాసనసభల్లో తీర్మానాలను బెదిరించైనా సరే ఆమోదింపజేయటానికి అన్నిరకాలుగా బిజెపి ప్రణాళికలు రచిస్తోందని సిఎం రేవంత్ ఆరోపించారు. ఇందులో భాగంగానే మోడీ దేశం నలుమూలలా తిరుగుతూ అన్ని రకాల వ్యవస్థలు, సంస్థలను ఉపయోగించుకొని ముప్పేట దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు, విధానాలకు విరుద్ధంగా నరేంద్రమోడీ, అమిత్ షాలు వ్యవహారిస్తున్నారని సిఎం రేవంత్ దుయ్యబట్టారు.

ఐదు నియోజకవర్గాల్లో బిజెపికి బిఆర్‌ఎస్ మద్ధతు
బిఆర్‌ఎస్, బిజెపి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, రిజర్వేషన్ల రద్దుపై ఈ రెండు పార్టీలు ఒకే విధానంతో ఉన్నాయని ముఖ్యమంత్రి విమర్శించారు. మల్కాజిగిరిలో బిజెపిని గెలిపిస్తామని శుక్రవారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారని, ఆయనపై కెటిఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. అది నిజమని శుక్రవారం మల్లారెడ్డి మాటలతో స్పష్టమైందని ఆయన తెలిపారు.ఈటలను కెటిఆర్ ఎందుకు విమర్శించడం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఐదు నియోజకవర్గాల్లో బిజెపికి బిఆర్‌ఎస్ మద్ధతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. పదేళ్లపాటు కెసిఆర్ భూములు అమ్ముతుంటే ఈటల రాజేందర్ ఎప్పుడూ మాట్లాడలేదని, కానీ, తాను రుణమాఫీ చేస్తాననగానే భూములు అమ్మవద్దని ఈటల కండీషన్లు పెడతున్నారని సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు. దేశంలో రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.

బిడ్డ బెయిల్ కోసం కెసిఆర్ రిజర్వేషన్‌లు తాకట్టు పెట్టారు….
మోడీపై కెసిఆర్ కార్యాచరణ ఎక్కడుంది? పది సంవత్సరాల ప్రభుత్వాన్ని వదిలేసి వంద రోజుల మా ప్రభుత్వాన్ని కెసిఆర్ టార్గెట్ చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు కుట్ర జరుగుతుంటే కెసిఆర్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, బిడ్డ బెయిల్ కోసం కెసిఆర్ ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లను తాకట్టు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌ను ప్రజలు బండకేసి కొట్టినా బలుపు తగ్గలేదన్నారు. రాజ్యాంగం రద్దు చేయాలని ఆనాడు కెసిఆర్ ప్రకటించలేదా? అని సిఎం రేవంత్ అన్నారు. కెసిఆర్ ఎవరి భావాజాలం కోసం పనిచేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్ల రద్దుపై బిఆర్‌ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కెటిఆర్ చిన్న పిల్లాడని, ఆయన మాటలకు స్పందించనని, కెసిఆర్ ఏమైనా విమర్శలు చేస్తే స్పందిస్తానని సిఎం రేవంత్ అన్నారు.

కెసిఆర్ మానసిక పరిస్థితి బాగోలేదు..
కెసిఆర్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దని, ప్రస్తుతం ఆయన మానసికంగా కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటున్నారని సిఎం అన్నారు. అధికారం కోల్పోయాక ఇంటా, బయట పరిస్థితులు బాగాలేవన్నారు. పిలిచినా ఎవరూ పలకడంలేదని, బెల్ కొట్టినా ఎవరూ రావడం లేదని సిఎం రేవంత్ సెటైర్ వేశారు.
పెద్దమ్మ తల్లిపై ఒట్టు….ఆగష్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తా
పెద్దమ్మ తల్లిపై ఒట్టు ఆగష్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. రుణమాఫీ ఎలా చేయాలో స్ట్రాటజీ నా దగ్గర ఉందని దాని ప్రకారమే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. 2014లో రూ. లక్ష రుణమాఫీ చేస్తానన్న కెసిఆర్ 2019 వరకు పూర్తి చేయలేదని, 2019లో మరోసారి రూ. లక్ష రుణమాఫీ చేస్తానని 2023 వరకు దానిని పూర్తి చేయలేదని సిఎం రేవంత్ మండిపడ్డారు. కానీ, మేం కెసిఆర్ మాదిరిగా మాట తప్పేది లేదని, ఆగష్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు.

తాము అధికారంలోకి వచ్చినప్పుడు రూ.7 లక్షల అప్పుతో తాము ప్రభుత్వాన్ని మొదలు పెట్టామని, దుబారా ఖర్చులు పూర్తిగా అపేశామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. బిసిలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. బిసి జనాభా లెక్కించడం చారిత్రాత్మక అవసరం అన్నారు. అక్రమంగానైనా అధికారంలోకి రావాలని మోడీ అనుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రశ్నలకు మోడీ, అమిత్ షా, నడ్డా దగ్గర సమాధానం లేదన్నారు. జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ఓబిసిలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే బిసి జనాభాను లెక్కిస్తామని, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని సిఎం రేవంత్ అన్నారు.

ఫోన్ ట్యాఫింగ్ విచారణ జరుగుతోంది
ఫోన్ ట్యాఫింగ్ విచారణ జరుగుతోంది, నివేదిక వచ్చిన తరువాతే తాను స్పందిస్తానని సిఎం రేవంత్ అన్నారు. బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ సమయంలో స్పందించడం సరైంది కాదన్నారు. అలా స్పందిస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చారు. హోంశాఖ తన వద్దే ఉందని, బాధ్యతగా వ్యవహరిస్తానని రేవంత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News