Monday, December 23, 2024

కోటీశ్వరుల కోసమే మోడీ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

నవీన్ ప్రభుత్వం ‘కొద్ది మంది’ కోసమే ఉన్నది
ఒడిశా ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ

కటక్ : కోటీశ్వరుల కోసమే ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడుపుతుండగా, ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ‘ఎవరో కొద్ది మంది వ్యక్తుల’ కోసం పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు. కటక్ సాలెపూర్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, బిజెడి, బిజెపి పరస్పరం ఎన్నికల పోరు సాగిస్తున్నప్పటికీ వాస్తవంలో అవి కలసి పని చేస్తున్నాయని అన్నారు.

‘దానిని భాగస్వామ్యం లేదా వివాహం అనండి, రెండూ బిజెడి, బిజెపి కలసే సాగుతున్నాయి’ అని ఆయన అన్నారు. నవీన్ పట్నాయక్‌పై రాహుల్ విరుచుకుపడుతూ, ఆయన ముఖ్యమంత్రే అయినా రాష్ట్రంలో బిజెడి ప్రభుత్వాన్ని ఆయన సహాయకుడు వికె పాండియన్ నడుపుతున్నారని ఆరోపించారు. ప్రధానిని పరోక్షంగా రాహుల్ ప్రస్తావిస్తూ, ‘అంకుల్‌జీ, నవీన్‌బాబు ఒడిశా పాన్ (పిఎఎఎన్‌ఎన్) ఇచ్చారు. అవి పాండియన్, అమిత్ షా, నరేంద్ర మోడీ, నవీన్ పట్నాయక్‌కు సంకేతాక్షరాలు. వారు మీ సంపదను దోచుకున్నారు’ అని విమర్శించారు.

‘గనుల కుంభకోణం ద్వారా రూ. 9 లక్షల కోట్లు లూటీ చేశారు. భూముల కబ్జాల ద్వారా రూ. 20 వేల కోట్లు దోచుకున్నారు. మొక్కల కుంభకోణం రూ. 15 వేల కోట్ల మేరకు జరిగింది. ఇక్కడ, ఢిల్లీలోను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ డబ్బును మీకు తిరిగి ఇవ్వడం ప్రారంభిస్తాం’ అని రాహుల్ చెప్పారు. అదే విధంగా తెలంగాణలో బిఆర్‌ఎస్ బిజెపితో కలసి పని చేస్తుండేది. ఆ పార్టీకి అధికార చ్యుతి కలిగించారు’ అని రాహుల్ చెప్పారు. ‘నవీన్ బాబు మీకు పాండియన్‌ను ఇచ్చారు. కాంగ్రెస్ మీకు ఏది ఇస్తుందో మీకు చెబుతాను. మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే మే ఐదు విప్లవాత్మక పనులు చేస్తాం. నిరుపేద కుటుంబాల జాబితా ఒకటి తయారు చేస్తాం.

ప్రతి కుటుంబంలో నుంచి ఒక మహిళను ఎంపిక చేసి, ఆమె బ్యాంకు ఖాతాలోకి ఏటా లక్ష రూపాయలు బదలీ చేస్తాం. అది నెలకు రూ. 8500 అవుతుంది’ అని ఆయన తెలియజేశారు. “పెహ్లీ నౌకరీ పక్కీ’ అనే పథకాన్ని తెస్తాం. డిగ్రీలు, డిప్లొమాలు ఉన్న నిరుద్యోగ యువజనులు అందరూ అప్రెంటిస్‌షిప్‌లు పొందుతారు. సంవత్సరానికి మీకు మొదటి ఉద్యోగం గ్యారంటీ ఇస్తాం.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆఫీసులలో ఆ ఉద్యోగం ఉంటుంది’ అని ఆయన వివరించారు. కాంగ్రెస్ ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మహిళలకు నెలకు రూ. 2000, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3000, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సిలిండర్‌కు రూ. 500తో ఎల్‌పిజి ఇస్తుందని హామీ ఇచ్చారు. ‘అంకుల్‌జీ 22 మంది కోటీశ్వరుల కోసం పని చేస్తే మేము కోట్లాది మంది లక్షాధికారులను సృష్టించబోతున్నాం’ అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News