పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సందేశ్ కలీ లోని షేక్ షాజహాన్ తరహా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని, ఆయన విమర్శించారు. వారి వల్ల మహిళలకు బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. సందేశ్‌కలీ లోని మహిళలు , వారి భూములను రక్షించడానికి వెళ్లిన దర్యాప్తు సంస్థల సిబ్బందిపై దారుణంగా దాడులు చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. ఈ పరిస్థితుల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌తో స్థానికులకు రక్షణ కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో మమతా బెనర్జీ బలహీన ప్రభుత్వానికి, ఆటవిక పాలనకు సందేశ్ కలీ సంఘటన ఓ ఉదాహరణగా వ్యాఖ్యానించారు. సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామీ వివేకానంద, అరబిందో వంటి ప్రముఖులు పుట్టిన బెంగాల్ గడ్డ మీద ప్రజలను భయపెట్టి, బెదిరించి ఈ ఎన్నికల్లో గెలవడానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. గెలుపు కోసం ఆమె ఎలాంటి వ్యూహాలు అమలు చేసినా ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. బెంగాల్‌లో 35 స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు