మన తెలంగాణ/బాలాపూర్: రిజర్వేషన్ల వ్యవహారంలో సంఘ్‌పరివార్ పేరిట జరుగుతున్న దుష్ప్రచారానికి ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సం ఘ్) సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్‌జీ భగవత్ ఎట్టకేలకు తెరదించారు. సమాజంలో సామాజిక, ఆర్థికఅసమానతలను రూపుమాపేందుకు రా జ్యాంగంలో రిజర్వేషన్లను హక్కుగా పొందుపర్చ డం జరిగిందని, అసమానతలు తొలగిపోయేవంత వరకు రిజర్వేషన్లు యధాతధంగా కొనసాగాలన్నదే సంఘ్‌పరివార్ అభిప్రాయం అని స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ కార్పొరేష న్ ప రిధిలోని నాదర్‌గుల్ గ్రామంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం అనుబంధ సంస్థగా
స్థాపించిన విద్యా భారతి విజ్ఙాన కేంద్రం (సిబిఎస్‌ఈ) విద్యాసంస్ధను పరమహంస పరివ్రాజకాచార్య పద్మభూషణ్ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిజీ దివ్యసుముఖములో డాక్టర్ మోహన్‌జీ భగవత్ ముఖ్యఅతిథిగా హాజరై ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లకు సంఘ్ పరివార్ వ్యతిరేకం అంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదంటూ తీవ్రంగా ఖండించడంతో పాటు వాస్తవానికి సంఘ్ పరివార్ మొదటి నుండి రిజర్వేషన్లకు అనుకూలంగా ఉందని వివరించారు. ప్రపంచాన్ని తెలుసుకునేందుకు మార్గం అయిన విద్యను లోకకళ్యాణానికి ఉపయోగించాలని సూచించారు.1952వ సంవత్సరంలో శ్రీసరస్వతి శిశు మందిర్ ఒక చిన్న గదిలో ప్రారంభం అయ్యిందని, అప్పట్లో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు కొనసాగుతున్నట్లు తెలిపారు. సనాతన భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల మిళితం అయిన ఉన్నత విలువలతో కూడిన ఉత్తమ విద్యను అందిస్తూ శ్రీ సరస్వతి విద్యాపీఠం సమాజానికి ఎనలేని సేవలు అందిస్తుందని కొనియాడారు.ప్రస్ధుతం సిబిఎస్‌ఈ విద్యావిధానంతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభించినప్పటికీ దేశభక్తి, సామాజిక విలువలతో కూడిన విద్యకు విద్యాపీఠం పెద్దపీట వేయడం జరగుతుందని అన్నారు.
విదేశాలకు విహారయాత్రలకు వెళ్లాలనుకునే భారతీయులు ముందుగా అయోధ్య లాంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే దేశభక్తి మరింతగా పెరుగుతుందని అన్నారు. స్వయంసేవక్‌లు తమ తుదిశ్వాస వరకు సమాజ హితాన్ని కాంక్షించి మాత్రమే పనిచేస్తారని, భారతీయులంతా శ్రీరాముని బాటలో నగవాలని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాలు, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ తదితర సాంకేతిక విప్లవాలను సమాజహితం కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. ఇటీవల కాలంలో సంఘ్ పరివార్‌పై కూడా పనికట్టుకొని కొందరు తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం అని అన్నారు. అంతకు ముందు అనుగ్రహ భాషణం చేసిన చిన్నజీయర్‌స్వామి ప్రసంగిస్తూ దేశం సమస్యల్లో ఉన్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మార్గదర్శనం చేశారని అన్నారు. భారత్‌ను విశ్వగురు స్థానంలో నిలిపేందుకు మోడీ అవిరళ కృషి సలుపుతున్నారని అన్నారు. తాను రాజకీయ నాయకుడిని కానని, కేవలం ఒక సగటు భారతీయుడిగా తన వాదనలను వినిపిస్తున్నానని స్పష్టం చేశారు.
విద్య అన్నది పొట్టకూటి కోసం కానేకాదని, సమాజంలో ఉత్తమ పౌరుడిగా తనను తాను తయారుచేసుకునేందుకు విద్యమాత్రమే సాధనం అని అన్నారు. అటువంటి విలువలతో కూడిన విద్యను అందిస్తున్న శ్రీ సరస్వతి విద్యాపీఠాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, క్షేత్ర ప్రచారక్ సుధీర్, సహప్రచారక్ భరత్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి, ప్రాంత ఉపాధ్యక్షులు పసర్తి మల్లయ్య, కార్యదర్శి ముక్కాల సీతారాములు, సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, పాఠశాల అధ్యక్షులు తేలుకుంట్ల రమేష్‌గుప్త, కార్యదర్శి విష్ణువర్ధన్‌రాజు పాల్గొన్నారు.