తెలుగు రాష్ట్రాల్లో శుభముహూర్తాలకు బ్రేక్ పడింది. దాదాపు మూడు నెలల పాటు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పండితులు తేల్చారు. ఈ మూడు నెలలు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాలు కావడంతో ముహుర్తాలు లేవని పండితులు వెల్లడించారు. దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలంలోనే అధికంగా వివాహాలు చేసుకుంటారు. ఈ క్రమంలోనే మార్చి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువ జంటలకు వివాహాలు జరిగాయి. ప్రతి సంవత్సరం మే నెలలో అత్యధిక వివాహాలు జరుగుతుంటాయి. కానీ, ఈ సారి ఆ అవకాశం లేదు.
అధిక మూడాల కారణంగా ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఆగిపోయినట్టే. సూర్యకాంతి గురు, శుక్ర గ్రహాలపై పడి ఈ మౌఢ్యమి సంక్రమిస్తుందని ఈ సమయంలో ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహుర్తాలు పెట్టడం సాధ్యం కాని పురోహితులు వివరిస్తున్నారు. ఈ మూడు నెలల పాటు వంటల వారు, పూల అలంకరణ చేసేవాళ్లు, క్యాటరింగ్ సిబ్బంది, లైటింగ్ డెకరేషన్ వారు, పెళ్లిముంతలు చేసే స్కిల్ వర్కర్లు, ప్రైవేటు కల్యాణ మండపాల యజమానులు విశ్రాంతి తీసుకోవాల్సిందే. వీరితో పాటు బంగారం, వస్త్రదుకాణాలు వెలవెల బోయే పరిస్థితులు నెలకొన్నాయి.