Friday, January 10, 2025

మత్తులో భవిత చిత్తు!

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ పడవలో రవాణా అవుతున్న 600 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు గుజరాత్ తీర సమీపాన స్వాధీనం చేసుకుందన్న వార్త.. దాయాది దేశం తన డ్రగ్ మార్కెట్ కు భారత్ ను ఏ విధంగా కేంద్రంగా చేసుకుందో కళ్ళకు కడుతోంది. వాస్తవానికి పాకిస్తాన్ నుంచి మాదక ద్రవ్యాలు భారత్ కు రవాణా అవుతూ మార్గమధ్యంలో పట్టుబడిన ఉదంతం ఇదే మొదటిది కాదు. అయితే పొరుగుదేశం మన పోలీసులు, నావికాదళాల కన్నుగప్పి ఇప్పటివరకూ ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను భారత్ కు చేరవేసిందనేదే ఆందోళన కలిగించే అంశం.

ఒకవైపు ఉగ్రవాదులను, మరోవైపు మాదకద్రవ్యాలను చేరవేస్తూ భారత్ ను అస్థిరపరిచేందుకు దశాబ్దకాలంగా పాక్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పరాయి దేశం ఎంత ఖర్చు చేస్తోందో అంతే ఖర్చును మాదకద్రవ్యాలను చేరవేసేందుకు కూడా చేస్తోంది. భారత ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ చేస్తున్న ఈ కుట్రలను భగ్నం చేసేందుకు భారత్ శతవిధాలా పోరాడుతున్నా, ఏదో ఒక మూలనుంచి మన దేశానికి మాదకద్రవ్యాలు చేరుతూనే ఉన్నాయి. ఆర్థిక సరళీకృత విధానాల అమలు మొదలయ్యాక అపారమైన మానవ వనరులకు పుట్టినిల్లుగా పేరొందిన భారత్ లో వ్యాపార అవకాశాలకోసం ప్రపంచ దేశాలన్నీ ఎగబడ్డాయి. అయితే సానుకూల దృక్పథంతో ఆలోచించే గుణం ఏకోశానా లేని దాయాది దేశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారత్ లో మాదకద్రవ్యాల చేరవేతకు తెరతీసింది. ప్రపంచంలోనే ఓపియం (నల్లమందు)ను అధికంగా సాగు చేసే మయన్మార్, ఆప్ఘనిస్తాన్ దేశాలకు సమీపంలో ఉండటం కూడా భారత్ కు శాపంగా పరిణమించిందనడంలో సందేహం లేదు.

ఆప్ఘన్ లో సాగయ్యే ఓపియంను పాకిస్తాన్ హెరాయిన్ గా మార్చి ఇండియాలోకి అక్రమంగా రవాణా చేస్తోంది. మయన్మార్ లోని షా, కచిన్ రాష్ట్రాలలో తయారయ్యే హెరాయిన్, మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను భారత్ లోకి అక్రమంగా రవాణా చేసేందుకు స్థానిక తిరుగుబాటు ముఠాలను చైనా ప్రోత్సహిస్తోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అంచనాల ప్రకారం భారతదేశానికి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్ లో 70 శాతం అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతం ద్వారా చేరుతున్నాయి. గత దశాబ్దకాలంగా భారతదేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా పెరిగింది. దాంతోపాటే వినియోగమూ ఇంతింతలయ్యింది. డ్రగ్స్ కు బానిసలవుతున్నవారిలో యువతదే సింహభాగం. జాతికి వెన్నుదన్నులా నిలవవలసిన యువతరం డ్రగ్స్ కు అలవాటుపడి, మత్తులో జోగాడుతోంది.

భారత్ ను టార్గెట్ గా చేసుకుని ముప్పేట సాగుతున్న ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే పటిష్టమైన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సస్ చట్టం రూపొందింది. డ్రగ్స్ ను మన దేశంలోకి రవాణా చేసేందుకు అక్రమార్కులు ఎప్పటికప్పుడు అనుసరించే సరికొత్త వ్యూహాలను అడ్డుకునేందుకు వీలుగా ఈ చట్టాన్ని మూడుసార్లు సవరించారు కూడా. అయితే చట్టాలు ఎంత పటిష్ఠంగా రూపొందినా, వాటిని పకడ్బందీగా అమలు చేసే వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నా సమాజంలో చైతన్యం రానిదే మాదకద్రవ్యాలను అరికట్టడం అసాధ్యం. ఎందుకంటే వీటికి అలవాటుపడినవారు అవి లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది.

అందువల్ల వాటికోసం అడ్డదారులు వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి, మాదకద్రవ్యాల వినియోగం గురించి, వాటివల్ల కలిగే నష్టాల గురించి ఊరూవాడా అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయడం ముఖ్యం. విద్యార్థుల పాఠ్యాంశాలలోనూ ఇదొక భాగం కావాలసిన అవసరం ఉంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా భారత్ నే కాకుండా అంతర్జాతీయంగా అన్ని దేశాలనూ అతలాకుతలం చేస్తోంది. సమాచార బదలీ, సమన్వయంతో డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాల ఆటకట్టించేందుకు దేశాల మధ్య సహాయ సహకారాలు పెంపొందాలి.

సరిహద్దులు, తీర ప్రాంతాల వద్ద గస్తీని పటుతరం చేయడం, నిరంతర నిఘా ఉంచడం వంటి చర్యలవల్ల మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపే అవకాశం ఉంటుంది. డ్రగ్స్ కు అలవాటుపడిన వారిని ఆ దురలవాటునుంచి మాన్పించేందుకు ప్రస్తుతం అక్కడక్కడ ఉన్న కౌన్సెలింగ్ కేంద్రాలు ఏమాత్రం చాలవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటి సంఖ్యను పెంచాలి. డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమాచారం అందించేలా పౌరులను చైతన్యం చేయడం కూడా అత్యంత ఆవశ్యకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News