న్యూఢిల్లీ : సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రచురించిన కథనంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దానిపై మీడియా అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సమాధానం ఇచ్చారు.
“ఒక సున్నితమైన అంశంపై ఆ నివేదిక నిరాధారమైన, అనవసర ఆరోపణలు చేస్తోంది. వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, ఇతరుల నెట్‌వర్క్‌లపై యాఎస్ ప్రభుత్వం అందించిన భద్రతా సమస్యలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
అది దర్యాప్తు కొనసాగిస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటి ఊహాజనితమైన, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చవు.” అని తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా లోని సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జె) ప్రతినిధి గురుపత్వంత్ సింగ్ ఖలిస్థానీల కీలక నేత.
భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికాలో ప్రాణాంతక ఆపరేషన్‌ను భారత గూఢచార సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు విస్మయం వ్యక్తం చేశారని ఆ కథనం పేర్కొంది. అయితే అమెరికా నిఘా విభాగాలు పన్నూపై హత్యాయత్నాన్ని అడ్డుకున్నాయని తెలిపింది. అలాగే ఆ ‘రా’ అధికారి పేరు విక్రమ్ యాదవ్‌గా పేర్కొంది. భారత ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి ఈ ప్లాన్ తెలుసునని వ్యాఖ్యానించింది.