Friday, December 20, 2024

గుజరాత్ పెత్తనమా..తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ పెత్తనమా..తెలంగాణ పౌరుషమా తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ పోలీసుల్ని కాదు.. సరిహద్దుల్లోని సైనికులను తెచ్చుకున్న భయపడబోనని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా , రేగొండ మండల కేంద్రంలో భూపాలపల్లి ఎంఎల్‌ఎ అధ్యక్షతన జరిగిన జన జాతర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భం గా సిఎం మాట్లాడుతూ..తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ పెత్తనానికి మధ్య ఇపుడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగాన్ని సమాలం గా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని మోడీ కుట్రలు పన్నుతున్నారని ఆ రోపించారు. తమకు 400 ఎంపి సీట్లు ఇవ్వండి.. రిజర్వేషన్లను రద్దు చేస్తాం అని బిజెపి అంటున్నదని మండిపడ్డారు.

ఇదే విషయంపై ప్రశ్నిస్తే ఢిల్లీ పోలీసులను తన వద్దకు పంపారని అన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులను పెట్టి చర్లపల్లి జైలుకు పింపించినా భయపడలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పడు అదే విధానాన్ని బిజెపి కూడా అమలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కెసిఆర్ ఆత్మ అమిత్ షాలో ప్రవేశించినట్టుందని ఎద్దేవా చేశారు. గత ఏడాది జరిగి అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌లో కెసిఆర్‌ను చిత్తు చిత్తుగా ఓడించామని, ఇక ఫైనల్స్‌లో ప్రధాని మోడీ, అమిత్‌షాలను ఢీకొట్టబోతున్నామన్నారు. తెలంగాణ సమాజం అత్యధిక సీట్లను గెలుపించుకొని రాహుల్ గాంధీని ప్రధాని చేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుందామని అన్నా రు. ఈ ప్రాంతానికి మోడీ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. పునర్‌విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీ కారిడార్, ఐఐటి, ఐఐఎంలు ఇవ్వలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, వరంగల్‌కు రావాల్సిన ఎయిర్‌పోర్ట్‌ను రాకుండా మోడీ అడ్డుకున్నారని ఆరోపించారు.

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటాలు నిర్వహించాయని మండిపడ్డారు. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ వివిధ వర్గాలకు రిజర్వేషన్లను ఇస్తే ఇపుడు బిజెపి రద్దు చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రధానంగా 1978లో బిసి, ఒబిసిలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలని అప్పటి మండల్ కమిషన్ రాష్ట్రపతికి నివేదికను సమర్పించిందని గుర్తుచేశారు. అయితే 52 శాతం ఉన్న బిసిలకు 27 శాతం రిజర్వేషన్లు 1990 అమలు చేయాలని నివేదికను ఇచ్చారని తెలిపారు. దీనిపై అద్వానీ రథయాత్రతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటాలు నిర్వహించాయని గుర్తుచేశారు. దీనిపై సుప్రీంకోర్టు రిజర్వేషన్ల అమలును సమర్థిస్తునే బిసి జనాభాను లెక్క గట్టిన తర్వాతనే అమలు చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. అందుకే రాహుల్ గాంధీ 150 రోజులపాటు 4 వేల కిలోమీటర్లు జోడోయాత్ర ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని, వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో బిసి జనాభాను లెక్క గట్టి, రిజర్వేషన్లు పెంచడానికి నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

బిజెపి, బిఆర్‌ఎస్ చీకటి ఒప్పందం
రాష్ట్రంలో బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు వేర్వేరు కాదని, వారి ఆలోచన, ఎన్నికల విధానం ఒక్కటై ఎన్నికల్లో పోటీ చేస్త్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ముగిసిన తరువాత కెసిఆర్ బిజెపితో పొత్తు పెట్టుకోబోతున్నారని అన్నారు. వరంగల్‌లో బిజెపి అమాయకుడిని పోటీలో పెట్టిందని అన్నారు. ప్రధానంగా ఆరూరి రమేష్‌ను బిఆర్‌ఎస్ నుండి బిజెపిలోకి పంపి పోటీ చేయిస్తున్నదని వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని బిజెపికి తాకట్టు పెట్టిందని విమర్శించారు. కెసిఆర్ కారు కార్ఖానాకు పోయిందని, ఇక తూకంలో అమ్ముకోవల్సిందేనని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News