Wednesday, December 4, 2024

సిసలైన అందానికే కిరీటం!

- Advertisement -
- Advertisement -

అందమంటే తెల్లగా, పొందికైన శరీర సౌష్ఠవం, చక్కటి కనుముక్కు తీరు కలిగి ఉండటమేనా? కమలాలవంటి కనులు, సంపెంగలాంటి ముక్కు, గులాబీరేకులవంటి పెదవులు, నునుపైన చెక్కిళ్లు.. అందమంటే ఇలా కవులు వర్ణించేది కానే కాదనీ, లౌకిక ప్రపంచంలో అందానికి ఉన్న ఈ సహజమైన నిర్వచనాలు తప్పని తాజాగా రుజువైంది. మిస్ యూనివర్స్ పోటీలకు సన్నాహమయ్యే క్రమంలో మిస్ బ్యూనస్ ఎయిర్స్‌గా 60 ఏళ్ల అలెజాండ్రా మరీసా రోడ్రిగెజ్ ఎంపికై, అందమంటే నిలువెత్తు ఆత్మవిశ్వాసం, కొండంత అంతఃసౌందర్యమేనని రుజువు చేసింది. అనాదిగా మనవాళ్లు అందాన్ని ఒక చట్రంలో బిగించేశారు. ప్రత్యేకమైన రూపురేఖలను, వర్చస్సు ను, ఆహార్యాన్ని అందంగా అభివర్ణించడం పరిపాటిగా మారింది.

చరిత్రను తిరగేస్తే శారీరక సౌందర్యమే అందమనే భావన కలిగించేలా ఎందరో కవులు, రచయితలు, మేధావులు చేసిన వర్ణనలు మన కళ్లకు కడతాయి. అందానికి స్త్రీ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన నేపథ్యంలో, తెల్లగా ఉండేవారే అందమైనవాళ్లని, ఇతర వర్ణాలలో ఉండేవారు అందమైనవాళ్లు కాదనే భావన కలిగించే ఈ రకమైన ఒరవడిని మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ వంటి అంతర్జాతీయ వేదికలు కూడా అందిపుచ్చుకున్నాయి. తమ పోటీల్లో పాల్గొనే అమ్మాయిల వయస్సుకు, శరీర కొలతలకు పరిమితులు విధిస్తూ, అలా ఎంపికైన వారికే కిరీట ధారణ చేస్తూ వచ్చాయి. నిన్నమొన్నటి వరకూ మిస్ యూనివర్స్ పోటీలు పెళ్లయిన మహిళలు, తల్లులకూ నిషిద్ధం. వర్ణ వివక్షను విడనాడినా, ఇతర విషయాలలో మాత్రం చాలాకాలంగా అందాల పోటీల నిర్వాహకులు దిగరామంటూ మొండికేస్తున్నారు.

వివక్షాపూరితమైన ఈ పోటీల నిర్వహణపట్ల విమర్శలు తలెత్తడంతో ఇప్పుడు ఈ వేదికలు తమను తాము సంస్కరించుకునే పనిలో పడ్డాయి. ఈ దిశగా మిస్ యూనివర్స్ నిర్వాహకులు గత ఏడాది నుంచి పోటీల నిర్వహణలో తీసుకొచ్చిన మార్పులు విప్లవాత్మకమైనవనే చెప్పాలి. పోటీల్లో పాల్గొనేవారి గరిష్ఠ వయసుపై పరిమితిని తొలగించడంతోపాటు, ప్లస్ వన్ సైజ్ బొద్దుగుమ్మలకు, ట్రాన్స్‌జెండర్లకూ కూడా అవకాశం కల్పిస్తూ అందానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. పెళ్లయిన మహిళలు, బిడ్డల తల్లులు కూడా పాల్గొనేందుకు వీలుగా నియమ నిబంధనలకు కొత్త రూపం ఇచ్చారు.

తత్ఫలితమే మొన్నటి మరీసా విజయమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతెందుకు? కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన గత ఏడాదే ఎల్ సాల్వడార్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ప్లస్ వన్ సైజ్ నేపాల్ సుందరి జానె దీపికా గారెట్, ట్రాన్స్ జెండర్లు మరీనా మాచెట్ (మిస్ పోర్చుగల్), రిక్కీ కోల్ (మిస్ నెదర్లాండ్స్) కూడా పాల్గొని తమ ప్రతిభాపాటవాలు కనబరిచారు. ఈసారి మిస్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్‌ను మరీసా గెలుచుకుంటే, రన్నరప్‌గా వచ్చిన ఇరిస్ అమేలియా కూడా వయసు పైబడిన మహిళే కావడం విశేషం. ఆమె 73 వయసులో ఈ పోటీల్లో పాల్గొన్నారు! అందమనేది చూసే కళ్ళను బట్టి ఉంటుందనేది ఆంగ్లంలో ఒక నానుడి. తెలుగులోనూ తావలచింది రంభ తామునిగింది గంగ అనే సామెత ఉండనే ఉంది. ఒకరికి అందంగా కనిపించింది మరొకరికి కనిపించకపోవచ్చు.

మనకు నచ్చినవారు ఎప్పుడూ అందంగానే కనిపిస్తారు. ముఖ్యంగా మనసుకు దగ్గరైతే, వారి శారీరక సౌందర్యంతో పని ఉండదు. ఒకనాటి పెళ్లిళ్లలో బాహ్య సౌందర్యానికి పట్టింపు ఉండేది కాదు. అందానిదేముంది? మనసులు కలిస్తే ఆ దాంపత్యం కలకాలం వర్థిల్లుతుందని పెద్దలు అనేవారు.సానుకూల దృక్పథం గలవారు అన్నింటిలోనూ అందాన్ని చూడగలుగుతారు. బాహ్య సౌందర్యం కాలంతో పాటే కరిగిపోతుందన్నది కాదనలేని సత్యం. అంతఃసౌందర్యం మాత్రం కాలంతోపాటే ప్రవర్థమానమవుతూ, పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. మిస్ బ్యూనస్ ఎయిర్స్ మరీసా మాటల్లోనూ ఈ అర్థం ప్రతిధ్వనించింది. ‘అందమంటే బయటకు కనిపించే శారీరక సౌందర్యం కాదనీ, ఆత్మ సౌందర్యమే అందమని ఈ పోటీలు నిరూపించాయి.

నాలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూసే న్యాయ నిర్ణేతలు నాకు ఈ విజయాన్ని అందించి ఉంటారు’ అన్న మరీసా మాటలు ఆమెలోని సిసలైన సౌందర్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి. పోటీల నిర్వహణలో చేసిన మార్పుల ద్వారా మిస్ యూనివర్స్ నిర్వాహకులు సిసలైన అందానికి పెద్దపీట వేశారనడంలో సందేహం లేదు. తద్వారా ఇతర పోటీ వేదికలు కూడా వివక్షాపూరితమైన విధానాలకు స్వస్తి పలకవలసిన సమయం ఆసన్నమైందని ఘంటాపథంగా చెప్పవచ్చు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News