మన తెలంగాణ/ హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సవాల్‌గా మారింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన హైదరాబాద్‌కు రాజస్థాన్ పోరు కీలకంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ గాడిలో పడాలనే లక్షంతో సన్‌రైజర్స్ ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో అసాధారణ ఆటతో అలరిస్తోంది.
ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ ఏకంగా 8 పోటీల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ ఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. హైదరాబాద్ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లను ఆడి ఐదింటిలో గెలిచింది. రాజస్థాన్‌పై కూడా గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే పటుటదలతో ఉంది. బెంగళూరు, చెన్నైలతో జరిగిన చివరి రెండు మ్యాచుల్లో హైదరాబాద్ లక్షఛేదనలో విఫలమైంది. దీంతో ఈసారి టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలనే ఆలోచనలో ఉంది.
ఓపెనర్లే కీలకం..
ఇక హైదరాబాద్ ఈ సీజన్‌లో సాధించిన విజయాల్లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు కీలక పాత్ర పోషించారు. అయితే కిందటి రెండు మ్యాచుల్లో ఇద్దరు విఫలం కావడంతో హైదరాబాద్‌కు ఇబ్బందులు తప్పలేదు. కానీ రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఇద్దరు ఉన్నారు. ఈ సీజన్‌లో హెడ్, అభిషేక్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లను హడలెత్తిస్తున్నారు. ఇద్దరు పోటీ పడి ఆడుతుండడంతో సన్‌రైజర్స్ ఇప్పటికే రెండు రికార్డు స్కోర్లను నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా అభిషేక్, హెడ్‌లపై హైదరాబాద్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా సన్‌రైజర్స్‌కు భారీ స్కోరు ఖాయం.
ఇక ఐడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్‌లు కూడా జట్టుకు కీలకంగా మారారు. హైదరాబాద్ విజయాల్లో వీరిద్దరిది కూడా కీలక పాత్రగానే చెప్పాలి. ఇద్దరు కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలిచారు. మార్‌క్రమ్ ఇప్పటికే సెంచరీతో సత్తా చాటాడు. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. కీలకమైన రాజస్థాన్ మ్యాచ్‌లో క్లాసెన్, మార్‌క్రమ్‌లు రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన క్లాసెన్ చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.
ఇక నితీష్ రెడ్డి, సమద్, షాబాజ్‌లతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఈ ముగ్గురు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. రాజస్థాన్‌పై వీరు మరింత మెరుగ్గా ఆడాలనే పట్టుదలతో ఉన్నారు. కమిన్స్, భువనేశ్వర్, షాబాజ్, ఉనద్కట్, నటరాజన్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. అయితే కొన్ని మ్యాచ్‌లుగా హైదరాబాద్ బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇది ఆందోళన కలిగించే అంశమే. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బౌలర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
జోరుమీదుంది..
మరోవైపు రాజస్థాన్ వరుస విజయాలతో జోరుమీదుంది. ఏకంగా 8 మ్యాచుల్లో గెలిచి నాకౌట్ బెర్త్‌ను దాదాపు సొంతం చేసుకుంది. హైదరాబాద్ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. ఓపెనర్లు యశస్వి జై స్వాల్, జోస్ బట్లర్‌లు అద్భుత ఫామ్‌లో ఉన్నా రు. వీరిద్దరూ ఇప్పటికే సెంచరీలతో సత్తా చా టారు. రాజస్థాన్ విజయాల్లో ఓపెనర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఉప్పల్ మ్యాచ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇక కెప్టెన్ సంజు శాంసన్ ఫామ్‌లో ఉండడం కూడా రాజస్థాన్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా సంజుకు ఉంది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రొమన్ పొవెల్, హెట్‌మెయిర్‌లతో రాజస్థాన్ బ్యాటింగ్ బలంగా ఉంది. అశ్విన్, బౌల్ట్, చాహల్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.