Saturday, November 23, 2024

రాయబరేలిలో రాహుల్ నామినేషన్

- Advertisement -
- Advertisement -

వెంట ఖర్గే, సోనియా, ప్రియాంక
అమేథీ, రాయబరేలిపై కాంగ్రెస్ సస్పెన్స్ ముగింపు
అమేథీలో కిశోరి లాల్ శర్మ అభ్యర్థిత్వం

రాయబరేలి/న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ రాయబరేలి నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాయబరేలి లోక్‌సభ సీటుకు నామినేషన్ దాఖలుకు గడువు ముగియడానికి ఒక గంట ముందు రాహుల్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయబరేలిపై సస్పెన్స్‌కు శుక్రవారం ఉదయం తెర దించింది. గడచిన రెండు దశాబ్దాలుగా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించి రాయబరేలి స్థానానికి రాహుల్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించింది. పొరుగున ఉన్న అమేథీ స్థానానికి గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరి లాల్ శర్మను తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.

రాహుల్ గాంధీ 2019లో అమేథీ నియోజకవర్గంలో ఓడిపోయారు. కానీ ఆయన కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన ఈ దఫా కూడా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ నెల 20న పోలింగ్ జరగనున్న రాయబరేలి నియోజకవర్గంలో నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి రోజు శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు రాహుల్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.

రాహుల్ బావగారు రాబర్ట్ వాద్రా కూడా ఆయన వెంట ఉన్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వారి కుటుంబం వెంట వెళ్లారు. ఆ నేతలు ముందు అమేథిలోని ఫుర్సత్‌గంజ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తరువాత వారు పొరుగున ఉన్న రాయబరేలికి వెళ్లారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాల కార్యకర్తలు రాహుల్‌కు అభినందనలు తెలియజేసేందుకు జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

తన తల్లి సోనియా గాంధీ, నాన్నమ్మ ఇందిరా గాంధీ, తాత ఫిరోజ్ గాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన రాయబరేలి స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. కాగా, రాయబరేలిలో తమ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్‌ను భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రకటించింది. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ చేతుల్లో ఓడిపోయారు. రాహుల్ గాంధీ, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చిత్రాలతో పోస్టర్లను గురువారం సాయంత్రం అమేథి జిల్లా గౌరీగంజ్‌లోని కాంగ్రెస్ కార్యాలయానికి తీసుకువచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News