Thursday, December 5, 2024

కొండలపై నుంచి లోయల్లోకి పడ్డ బస్సు..20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కనీసం 20 మంది దుర్మరణం చెందారు. 21 మంది వరకూ గాయపడ్డారు. పర్వతాల నడుమ ఉండే గిల్గిత్ బల్టిస్థాన్ ప్రాంతపు డయామెర్ జిల్లాలో కీలకమైన రాదారి కరాకోరమ్ హైవేపై బస్పు అదుపు తప్పి , కింద ఉన్న లోయలో పడటంతో ప్రమాదం చోటుచేసుకుందని స్థానిక పోలీసులు, అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో ఉన్న బస్సు రావల్పిండి నుంచి గిల్గిత్‌కు వెళ్లుతుండగా ఘటన జరిగింది. ఓ ప్రమాదకర మలుపు వద్ద డ్రైవర్ అదుపు తప్పి పల్టీలు కొడుతూ అక్కడికి సమీపంలో పారే సింధు నది వద్ద ఉన్న లోయలో పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడైంది. గాయపడ్డ వారిని వెంటనే సమీపంలోని చిలాస్ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. ఈ ప్రాంతంలోకి సైనిక హెలికాప్టర్లను పంపించడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి.

గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీనితో మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చునని ఆందోళన చెందుతున్నారు. మృతులలో ముగ్గురు మహిళలు ఉన్నారు. స్థానిక మసీదుల నుంచి మైక్‌లలో వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిపారు. గాయపడ్డ వారికి రక్తదానానికి తరలిరావాలని స్థానికులకు మసీదు మతపెద్దలు పిలుపు నిచ్చారు. ఘటనపై దేశాధ్యక్షులు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ , గిల్గిత్ బల్టిస్థాన్ ముఖ్యమంత్రి హాజి గుల్బార్ ఖాన్ ఇతరులు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. అత్యంత క్లిష్టమైన కొండప్రాంతాలలో సరైన శిక్షణ లేని డ్రైవర్లే బస్సులు నడుపుతూ ఉండటంతో పాకిస్థాన్‌లో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News