న్యూఢిల్లీ: జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్న బాధితులకు అన్ని విధాల సహాయం అందచేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కోరుతూ ఒక లేఖ రాశారు. కర్నాటకలోని హసన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ చర్యలను రాహుల్ తన లేఖలో ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులతో రేవణ్ణ తప్పించుకున్నారని ఆయన ఆరోపించారు.
మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఎన్నడూ పెదవి విప్పని ఒక సీనియర్ ప్రజా ప్రతినిధిని తాను ఎప్పుడూ చూడలేదని రాహుల్ తన లేఖలో ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. బాధఙతులకు అన్ని విధాల సహాయం అందచేయాలని ఆయన తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. న్యాయం కోసం పోరాడుతున్న బాధితులకు మన ఆదరణ, సంఘీభావం అవసరమని ఆయన తెలిపారు. ఈ నేరాలకు బాధ్యులైన అన్ని రాజకీయ పార్టీలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడడం మన సమిష్టి బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ చర్యలను భయానక లైంగిక హింసాకాండగా రాహుల్ అభివర్ణిస్తూ అనేక సంవత్సరాలుగా వందలాది మంది మహిళలపై లైంగికంగా దాడి చేసి వీడియోలు తీశారని ఆరోపించారు. ఒక సోదరుడిగా, కుమారుడిగా అతడిని(ప్రజ్వల్) చూసిన మహిళలు అత్యంత హింసాత్మక పద్ధతిలో వేధింపులకు గురయ్యారని, వారి మాన మర్యాదలు మంటగలిశాయని ఆయన పేర్కొన్నారు. మన తల్లులు, సోదరీమణులపై జరిగిన ఈ అత్యాచారాలకు కఠినాతి కఠిన శిక్షలు విధించి తీరాలని ఆయన తెలిపారు. 2023 డిసెంబర్‌లోనే ప్రజ్వల్ చరిత్ర గురించి, ముఖ్యంగా మహిళలపై అతను పాల్పడిన లైంగిక వేధింపులు, వాటికి సంబంధించిన వీడియోల గురించి కర్నాటక బిజెపి నాయకుడు జి దేవరాజె గౌడ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సమాచారం అందచేశారన్న విషయం తెలిసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు.
కేంద్రంలో అధికార బిజెపికి చెందిన అత్యున్నత నాయకత్వం దృష్టికి ఈ దారుణ అకృత్యాలను తీసుకు వెళ్లినప్పటికీ ఒక మాస్ రేపిస్టు తరఫున ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేయడం మరింత దిగ్భ్రాంతిని కలిగించిందని రాహుల్ తెలిపారు. ఈ దారుణాలపై అతర్థవంతమైన దర్యాప్తు జరగకుండా అడ్డుకునేందుకు ప్రజ్వల్ దేశం విడిచి పారిపోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో మన తల్లులు, సోదరీమణులకు న్యాయం కోసం పోరాడవలసిన నైతిక బాధ్యత మనపైన ఉందని రాహుల్ పేర్కొన్నారు.