Friday, December 20, 2024

ఉల్లి రైతులకు కేంద్రం తీపి కబురు

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల వేళ ఉల్లి రైతులకు కేంద్రంలోని మోడీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉల్లి ఎగుమతులపై గతంలో విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఉల్లికి కనీస ఎగుమతి ధర (ఎంఇపి)ని టన్నుకు 550 డాలర్లు (కిలోకు సుమారు రూ. 46), 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. సుంకాన్ని పరిగణనలోకి తీసుకుంటే టన్నుకు 770 డాలర్లు (కిలోకు సుమారు రూ. 64) లోపు సరకుల రవాణాను అనుమతించరు. ఉల్లి ఉత్పత్తి పడిపోవచ్చుననే ఆందోళన నడుమ రీటైల్ ధరల నియంత్రణ నిమిత్తం కేంద్రం నిరుడు డిసెంబర్ 8న ఉల్లి ఎగుమతులను నిషేధించింది. గడచిన 45 ఏళ్లలో దేశం ఏటా 17 లక్షల టన్నులు, 25 లక్షల టన్నుల మధ్య ఉల్లిపాయలు ఎగుమతి చేసింది. అదే విధంగా ఉల్లి ఎగుమతి ధరను టన్నుకు రూ. 45860గా ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డిజిఎఫ్‌టి) విడుదల చేసిన ఒక నోటిఫికేషన్‌లో ఉల్లి ఎగుమతి ధరను 550 డాలర్లుగా పేర్కొనడమైంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు మేలు జరగనున్నది.

నిషేధం ఎత్తివేత రీటైల్ మార్కెట్లలో ధరల పెరుగుదలకు దారి తీయదని కేంద్ర వినిమయ వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే స్పష్టం చేశారు. ‘ధరలు స్థిరంగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా పెరుగుదల ఉంటే అది నామమాత్రంగానే ఉంటుంది’ అని ఆమె సూచించారు. వినియోగదారులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం నిబద్ధమై ఉందని ఆమె చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం రాత్రి 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. మహారాష్ట్రలోని నాసిక్, అహ్మద్‌నగర్, సోలాపూర్ వంటి కీలక ఉల్లి ఉత్పత్తి ప్రాంతాల్లో కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాముఖ్యం సంతరించుకుంటున్నది. ఈ నిర్ణయం వెనుక హేతుబద్ధతను ఖరే వివరిస్తూ, ‘సరఫరా పరిస్థితి సంతృప్తికరంగా ఉంది, టోకు, రీటైల్ మార్కెట్లలో ధరలు స్థిరంగా ఉన్నాయి’ అని తెలియజేశారు. నాసిక్‌లోని లాసల్‌గాఁవ్ మండిలో మోడల్ ధర ఏప్రిల్‌లో కిలోకు రూ. 15గా ఉంది. రబీ సీజన్‌లో ఉల్లి ఉత్పత్తి తాజా అంచనాలు 191 లక్షల టన్నులుగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రపంచ మార్కెట్లలో ఉల్లి లభ్యత, ధరలను కూడా పరిగణించినట్లు ఆమె చెప్పారు. ఉల్లి నెలసరి దేశీయ డిమాండ్ సుమారు 17 లక్షల టన్నులని ఖరే తెలియజేశారు. ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు కనుక ఉల్లి ఎగుమతి అవసరం ఉందని భావించినట్లు ఆమె తెలిపారు. ఇక విదేశాలకు ఉల్లి ఎగుమతిపై పూర్తి నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం శ్రీలంక, యుఎఇ, బంగ్లాదేశ్ వంటి దేశాలకు మాత్రం పరిమితులతో కూడిన ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని ఉల్లి రైతులు, వ్యాపారులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఉల్లి రైతులు ఈ డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. అయితే, దేశంలో ఉల్లి ధరలు పెరుగుతాయనే కారణంతో ప్రభుత్వం నిషేధాన్ని అలాగే కొనసాగించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరొక వైపు ‘దేశీ చనా’ (శనగపప్పు) ఉత్పత్తులు తగ్గిపోవడంతో వాటికి వచ్చే ఏడాది మార్చి వరకు దిగుమతి సుంకం నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. గతంలో దేశ రాజధాని ఢిల్లీలో వాటి ధర క్వింటాల్‌కు రూ. 5700తో పోలిస్తే పది శాతం పెరిగి రూ. 6300కు చేరింది. అదే విధంగా పసుపు బఠానీ దిగుమతి సుంకంపై ఇది వరకే జారీ చేసిన బిల్లు గడువు ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు కేంద్రం పొడిగించింది.

ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఉపసంహరించిన తరువాత మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని లాసల్‌గాఁవ్ మార్కెట్‌లో ఉల్లి ధరలు క్వింటాల్‌కు సగటున రూ. 200 మేర పెరిగాయి. లాసల్‌గాఁవ్‌లోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఎపిఎంసి)ని దేశంలో అతిపెద్ద టోకు ఉల్లి మార్కెట్‌గా పేర్కొంటున్నారు. ‘మార్కెట్‌లో ఒకింత పెరుగుదల ఉన్నది. సగటు ధరలు క్వింటాల్‌కు సుమారు రూ. 200 మేర పెరిగాయి. రైతులకు ఈ నిర్ణయం వల్ల లబ్ధి చేకూరుతుంది. కాని అసలు ప్రభావం సోమవారం మార్కెట్ తిరిగి తెరచుకున్న తరువాత తెలుస్తుంది’ అని ఎపిఎంసి చైర్మన్ బాలాసాహెబ్ క్షీరసాగర్ చెప్పారు. శనివారం ఎపిఎంసి సుమారు 200 క్వింటాళ్ల ఉల్లిపాయలు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ధరలు నాణ్యతను బట్టి క్వింటాల్‌కు రూ. 801, రూ. 2551, రూ. 2100 శ్రేణిలో ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News