వ్యవసాయరంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంటనష్టం పంపిణీపై అడుగు ముందుకు వేసింది. ఈ నెల 13నుంచి పంటనష్టం పరిహారాలను నేరుగా బ్యాంకుల్లో రైతుల ఖాతాలకు జమచేసేందుకు చర్యలు తీసుకుంటోంది. పంనష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకుని పంపిణీకి ఏర్పాట్లు చేపట్టింది.
ప్రభుత్వ ఖజానా నుంచి మొత్తం రూ.15.81కోట్లు పంపిణీ చేసేందుకు ఆర్ధికశాఖకు ఆదేశాలు ఇచ్చింది.ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 15,812 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎకరాకు రూ. 10 వేల చొప్పన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ. 15.81 కోట్లు సమకూర్చింది. ఇప్పటికే వ్యవసాయశాఖ పంటలు నష్టపోయిన రైతుల జాబీతాలను సిద్దం చేసివుంచింది. ఆర్ధికశాఖ నుంచి నిధులు విడుదల కాగానే రైతుల ఖాతాలను నేరుగా నిధులు జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్టు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.