కాఠ్‌మాండూ : ప్రస్తుతం పాఠశాలలో చిన్నారులపై ఉపాధ్యాయులు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. కానీ కొన్నేళ్ల క్రితం విద్యనభ్యసించిన వారికి మాత్రం ఇది సాధారణం. ఈ తరహా శిక్ష భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కు కూడా ఎదురైంది. తాను చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మరచిపోలేనని స్వయంగా ఆయనే వెల్లడించారు. జువెనైల్ జస్టిస్ ( బాలల నేర న్యాయవ్యవస్థ ) అంశంపై నేపాల్‌లో జరుగుతున్న సదస్సుకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. పిల్లలతో ఉపాధ్యాయుల ప్రవర్తనా విధానం వారి మనసుపై లోతైన ప్రభావం చూపుతుందని, అది వారికి జీవితాంతం గుర్తుండిపోతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. “ నేను 5 వ తరగతి చదువుతున్న రోజుల్లో జరిగిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో క్రాఫ్ట్ నేర్చుకుంటున్నా. అసైన్‌మెంట్ కోసం అవసరమైన సరైన సైజు గల సూదులను తీసుకురాలేదు. ఈ విషయం తెలుసుకుని మా టీచర్ నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెత్తంతో నా చేతిపై బలంగా కొట్టారు. చేతిపై కొట్టకుండా మరెక్కడైనా కొట్టమని ఎంతో వేడుకున్నా. దెబ్బలకు నా కుడి చేయి కందిపోయింది.
అవమానంతో 10 రోజుల వరకు చేతిని ఎవరికీ చూపించుకోలేదు” అని పంచుకున్నారు. “ కొంతకాలం తరువాత భౌతిక గాయం నయమైంది. కానీ ఆ సంఘటన నాపై ఎంతో ప్రభావం చూపించింది. ఇప్పటికీ ఏదైనా పనిచేస్తున్నప్పుడు గుర్తుకు వస్తుంది” అని అన్నారు. చట్టపరమైన సంఘర్షణల్లో చిక్కుకున్న బాలల బలహీనతలు, ప్రత్యేక అవసరాలను గుర్తించాలన్నారు. ముఠాల ద్వారా చిన్నారులు నేర కార్యకలాపాల్లోకి బలవంతంగా వెళ్తున్న విషయాన్ని పరిగణన లోకి తీసుకోవాలన్నారు. దృష్టి లోపం ఉన్న పిల్లలతో వ్యవస్థీకృత నేర బృందాలు ఎలా భిక్షాటన చేయిస్తున్నాయో చూస్తూనే ఉన్నామని, యుక్తవయసు పిల్లలు, దివ్యాంగులకు కూడా ఈ ముప్పు ఉందన్నారు.