కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్ని ఆదివారం కొత్త వివాదం సృష్టించారు. జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళం (ఐఎఎఫ్) వాహన శ్రేణిపై ఇటీవల జరిగిన దాడి బిజెపి ఎన్నికల స్టంట్ అని చన్ని ఆరోపించారు. ‘ఇవన్నీ స్టంట్‌లే, ఉగ్రవాదుల దాడులు కావు. ఇవి బిజెపి ఎన్నికల ముందు స్టంట్ తప్ప మరేమీ కావు. బిజెపి ప్రజల ప్రాణాలతో, మృతదేహాలతో ఆడుకుంటోంది’ అని ఆయన ఆరోపించారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి అటువంటి సంఘటనలను
బిజెపి సృష్టిస్తుంటుందని చన్ని ఆరోపిస్తూ, అటువంటి దాడులు ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగినవని, బిజెపి ఎన్నికల అవకాశాల మెరుగుకు ఉద్దేశించినవని అన్నారు.‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అటువంటి స్టంట్‌లు జరిపిస్తుంటారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అటువంటి సంఘటనలు సంభవించాయి’ అని చన్ని తెలిపారు. శనివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలో ఐఎఎఫ్ వాహన శ్రేణిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు ఒక ఐఎఎఫ్ ఉద్యోగి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సురాన్‌కోలోని సనాయ్ గ్రామంలో ఆ దాడి జరిగింది.