Saturday, January 11, 2025

కొలువుల్లో కొత్త శకం.. మహిళలకు లక్షవరం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి / గద్వాల ప్రతినిధి : కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెం టనే జాతీయ గణన చేపట్టి దేశంలోనే మరో విప్లవం తీసుకురాబోతుందని జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల జిల్లా, ఎర్రవల్లిలో ఆదివారం నిర్వహించిన పార్టీ జన జాతర బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ జాతీయ గణనను చేపట్టకుండా పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో జాతీయ జనగణన నిర్వహించి ప్రతి కుటుంబం జాబితాను రూపొందిస్తామన్నా రు. పేద, మధ్య తరగతి కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్షంగా ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురాబోతున్నామన్నారు. అదేవిధంగా 21వ దశాబ్దంలో కూడా మహిళలు, పురుషులకు

సమానంగా పనిచేస్తూ ఉపాధి కోసం కష్టపడుతున్నారని అన్నారు. మహిళలు మరో 8 గంటలు తమ ఇళ్లల్లో పనిచేస్తూ అధిక శ్రమకు గురవుతున్నారన్నారు. ఇది పురుషులకు ఇబ్బంది కలిగించే విధంగా చెప్పినా అధిక సమయం కష్టపడుతున్న మహిళల కోసం ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మకమైన పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకురాబోతుందన్నారు. మహిళలకు లక్ష రూపాయల చొప్పున సహాయం అందించే మరో చారిత్రాత్మక పథకానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. యువతకు పక్కాగా ఉద్యోగ పథకాన్ని అమలు చేస్తామని, దేశంలో నైపుణ్యత గల యువ శక్తిగా యువతను తీర్చిదిద్దడమే తమ లక్షంగా ముందుకు సాగుతామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్‌లో వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించే బృహత్తర పథకానికి రూపకల్పన చేస్తామన్నారు. నెలకు రూ.8500 చొప్పున ఏడాదికి లక్ష రూపాయలను యువతకు ఉపాధి కల్పించి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలను అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో 50 శాతానికి మించి రిజర్వేషన్‌లను అమలు చేయకపోవడం వల్ల 15 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలు, 8 శాతం ఉన్న దళితులు, 8 శాతం ఉన్న ఆదివాసీలు, 15 శాతం ఉన్న ముస్లిం మైనార్టీలకు, 5 శాతం ఉన్న ఇతర సామాజిక వర్గాలలోని పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. గిరి గీసి 50 శాతమే రిజర్వేషన్‌లను బిజెపి ప్రభుత్వం అమలు చేస్తూ మొండిగా వ్యవహరిస్తోందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్ల శాతాన్ని పెంచి పేద ప్రజలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే అంబేద్కర్, మహాత్మ గాంధీ రచించిన రాజ్యాంగాన్ని రూపుమాపడం ఖాయమన్నారు. రాజ్యాంగ పుస్తకాన్ని చించివేయడానికి బిజెపి దాని అనుబంధ సంఘమైన ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంఘాలు బహిరంగంగానే చెబుతున్నాయని ఇదే జరిగితే దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలు మరింత పేదరికంలో కూరుకుపోవడం తథ్యమన్నారు. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు.

జాతీయ జనగణనతో విప్లవం
దేశంలో జాతీయ జనగణనను చేపట్టి విప్లవానికి నాంది పలుకుతామని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటివరకు దేశంలో కులాల వారీగా జనగణన జరగలేదన్నారు. జాతీయ జనగణన ద్వారా పేద కుటుంబాలను గుర్తించి వారికి మేలు చేసే పథకాలను అమలు చేయడం ద్వారా సమానత్వాన్ని సాధించడం సాధ్యమవుతుందని అన్నారు. జాతీయ జనగణన జరగకపోవడం వల్ల పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారని, ధనికులు ధనికులుగా ఎదుగుతున్నారని, ఈ తారతమ్యాలు తొలగిపోవాలన్నది తమ ప్రభుత్వ లక్షమన్నారు. కుల గణన ద్వారా ఏ సామాజిక వర్గం జనాభా ఎంత ఉంది, వారి ఆర్థిక స్థితిగతులు ఏ మేరకు ఉన్నాయో తెలిసిపోతుందని, తద్వారా పేదరికంలో ఉన్న వారిని గుర్తించి ఉపాధి, సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యమవుతుందన్నారు. కులాల వారిగా జనగణన జరిగితే సమాజంలో ఏ వర్గాల చేతిలో ఎంత మేరకు నిధులు, ఆస్తులు ఉన్నాయో తెలిసిపోతుందని ఏ సామాజిక వర్గం వారు ఉద్యోగ, ఉపాది రంగాలలో ఎంత మేరకు లబ్ధి పొందుతున్నారో తెలిసిపోతుందన్నారు. జనగణన మరో చారిత్రాత్మక విప్లవం కాబోతుందని రాహుల్ గాంధీ అన్నారు.

బిజెపి రాజ్యాంగాన్ని రూపుమాపజూస్తోంది
కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కనుసనుల్లో రాజ్యాంగాన్ని రూపుమాపడానికి కుట్రలు చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అనేక వేదికలపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు తమకు మెజార్టీ స్థానాలు కల్పిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. ఇప్పటివరకు పేద, మధ్య తరగతి ప్రజలకు, అణగారిన వర్గాలకు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులే దక్కుతున్నాయన్నది ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం అన్నారు. ఈ రాజ్యాంగమే లేకపోతే పేదల హక్కులు దక్కేవా అని ప్రశ్నించారు. అంబేద్కర్, మహాత్మ గాంధీలు రచించిన రాజ్యాంగాన్ని మార్చి తమ సొంత ఎజెండాతో పాలించాలన్నది వీరి లక్షమన్నారు. బిజెపి లక్షమంతా బడా బాబులకు కొమ్ము కాయడం, దేశంలోని వనరులను దోచిపెట్టడమేనని అన్నారు. ఇప్పటికే అదానీ, అంబానీ లాంటి 22 మంది బడాబాబులకు దేశ వనరులను ధారాదత్తం చేశారని ఆయన దుయ్యబట్టారు. లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేశారన్నారు. రైతులు, రైతు కూలీల రుణాలను మాఫీ చేయడానికి బిజెపి ప్రభుత్వానికి చేతులు రాలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.

కాంగ్రెస్ ఎప్పుడూ పేదల పక్షమే
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలో ఉన్న పేదల పక్షాన నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రైతులు, కూలీల రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ మీ అప్పులు మాఫీ చేయరని, దేశంలోని బడా బాబుల అప్పులను మాత్రమే మాఫీ చేస్తారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా రైతు పండించిన పంటలకు మద్దతు ధరను కల్పించబోతున్నామని అన్నారు. ఈ విధానంతో దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమన్నారు.

యువతకు మేలు చేసే విధంగా పక్కా ఉద్యోగం
దేశంలోని యువతకు మేలు చేసే విధంగా ప్రతి పేద నిరుద్యోగ యువతకు పక్కాగా ఉద్యోగం కల్పించే పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. ప్రస్తుతం దేశంలోని సంపన్న వర్గాల పిల్లలకు మాత్రమే అప్రెంట్‌షిప్ వంటి విధానాలు అమలు చేస్తూ ఉపాధిలో వారిని అగ్రగాములుగా నిలిచారని, పేద పిల్లలు మాత్రం ఇలాంటి పథకాలకు దూరమవుతున్నారని, ఈ విధానం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్‌లలో సంపన్నుల పిల్లలు తప్ప పేదలకు ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదన్నారు. దేశంలోని ఉన్నత విద్యావంతులకు ఉద్యోగం కల్పించే బృహత్తర పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. తద్వారా కోట్లాది యువకులకు ఈ స్కీం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఉద్యోగం కల్పించిన వెంటనే లక్ష రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అన్నారు. దేశంలో నైపుణ్య వంతమైన యువశక్తిగా తీర్చిదిద్దడమే తమ లక్షమన్నారు.

నిరుద్యోగం, ధరల పెరుగుదల మీడియాకు కనిపించడం లేదు
దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల విలయతాండవం చేస్తోందని, పేదరికంతో ప్రజలు అల్లాడుతున్నారని, ఇదంతా మీడియాకు కనిపించడం లేదని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ కనుసన్నల్లో మీడియా నడుస్తోందన్నారు. సమాజంలో ఒకేవైపు చూస్తే ఆ సమాజం, దేశం నాశనం అవుతుందని అన్ని వర్గాలను సమానంగా చూసినప్పుడే అసమానతలు లేని బలమైన సమాజంగా తీర్చిదిద్దవచ్చన్నారు. మీడియా కంపెనీలలో ఇతర పరిశ్రమలలో డబ్బున్న వారు అగ్రకులాల పెత్తనం ఉండడం వల్లే ఇదంతా జరుగుతోందన్నారు.
రిజర్వేషన్‌లను పెంచుతాం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లను బరిగీసి పెంచడం లేదని, కేంద్రంలో తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 50 శాతానికి మించి పెంచుతామన్నారు. జనాభా, కుల గణన ద్వారా సమగ్ర సమాచారాన్ని సేకరించి సమాజంలోని అణగారిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్‌లను అమలు చేస్తామన్నారు. బిజెపి మరోమారు అధికారంలోకి వస్తే రిజర్వేషన్‌లను తీసివేయడం ఖాయమన్నారు. ఇప్పటికే బిజెపి నాయకులు బహిరంగంగా రిజర్వేషన్‌లను తొలగిస్తామని చెబుతున్నారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి రిజర్వేషన్‌లను తొలగించడానికి కుట్రలు చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అద్భుతంగా అమలు చేస్తోందన్నారు. పది లక్షల ఆరోగ్య స్కీం, రూ.500లకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఆసరా పింఛన్ల అమలు జరుగుతున్నాయని అన్నారు. దీంతో పాటు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు.

మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంపి స్థానాలను గెలిపించాలి
కేంద్రంలో పేదల ప్రభుత్వం రావాలంటే మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపి స్థానం నుంచి డాక్టర్ మల్లు రవిలను చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాహుల్ గాంధీ కోరారు. పేద, మధ్య తరగతి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. మోడీ కోటీశ్వరుల ప్రభుత్వమని మోడి ప్రభుత్వం వల్ల పేదలకు న్యాయం జరగదన్నారు. ఎండకు ఓర్చి ఇంత పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని…నన్ను దించాలని చూస్తున్నారు ః సిఎం రేవంత్ రెడ్డి
తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని…తనను దించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘కెటిఆర్‌కు తాను సవాల్ చేస్తున్నా.. నీకు సినీ మిత్రులు ఉన్నారు కదా వారితో చీర కట్టించుకుని ముస్తాబై ఉచితంగా బస్సులో జోగులాంబ వరకు ప్రయాణిస్తే కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు ఎలా ఉన్నాయో అర్థమవుతాయి’ అని అన్నారు. 9వ తేదీ వరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. హరీష్ రావు రైతులను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆగస్ట్టు 15 నాటికి రూ.2 లక్షల రైతు రుణమాఫీని చేసి చూపిస్తానని జోగులాంబ సాక్షిగా చెబుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్‌లో కెసిఆర్‌ను ఓడించి సెమీఫైనల్‌లోకి వెళ్లామని, మే 13న గుజరాత్‌ను ఓడించి తెలంగాణను గెలిపిద్దామని పరోక్షంగా మోడీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బిజెపి బయ్యారం ఇచ్చిందా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిందా బిజెపి ఏం ఇచ్చింది, బిజెపి ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు సంధించారు.

అరుణమ్మ ఏం తెచ్చింది అంటే ప్రజల నుంచి గాడిద గుడ్డు అంటూ స్పందన వచ్చింది. గాడిద గుడ్డు ఆకారాన్ని ప్రదర్శిస్తూ కేంద్రంలోని బిజెపిని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. బంగ్లా రాజకీయాన్ని అరుణమ్మ రాజకీయాన్ని శాశ్వతంగా బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని డికె అరుణ, ఆమె భర్త భరత్ సింహా రెడి వేల కోట్లు కూడగట్టుకున్నారన్నారు. అరుణమ్మను జెడ్‌పిటిసిని చేసింది, ఎంఎల్‌ఎను చేసింది, మంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్, బిజెపి కలిసి గద్వాలలో రాజకీయం చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 70 ఏళ్ల తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాకు నల్లమల బిడ్డనైన తనకు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కిందని, జిల్లాను అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. వంశీచంద్ రెడ్డి, మల్లు రవిలను లక్షకు తగ్గకుండా మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, నాగర్‌కర్నూల్ ఎంపి అభ్యర్థి మల్లు రవి, మహబూబ్‌నగర్ ఎంపి అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఎల్‌ఎలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచకుళ్ల రాజేష్ రెడ్డి, మేఘా రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జెడ్‌పి చైర్‌పర్సన్ సరితతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News