Friday, December 20, 2024

ఎంఎల్‌సి కవితకు మళ్లీ చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సిబిఐ, ఇడి కేసుల్లో ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ న్యాయ మూర్తి జస్టిస్ కావేరి బవేజా సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసుల్లో వేర్వేరుగా కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా న్యాయ స్థానం మే 2న తీర్పు రిజర్వ్ చేసింది. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత వెల్లడించారు. మహిళగా పిఎం ఎల్‌ఎ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందన్నారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఏప్రిల్ 22న కోర్టులో వాదనలు జరగ్గా తీర్పును మే 2 కు రిజర్వ్ చేసింది. ఆ రోజు విచారణ సందర్భంగా మే 6వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో కవితను మార్చి 15న ఇడి అరెస్ట్ చేయగా ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది.

ఈ క్రమంలో ఆమె రెండు బెయిల్ పిటిషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 22న విచారణ సందర్భంగా కవిత బెయిల్ పిటిషన్లపై ఆమె తరఫు లాయర్లతో పాటు ఇడి, సిబిఐ తరఫున లాయర్లు సైతం వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారని, ఇడి కస్టడీలో ఉండగానే సిబిఐ ఆమెను అరెస్ట్ చేసిందని కోర్టుకు ఆమె తరఫున న్యాయవాది సింఘ్వి వాదించారు. బిఆర్‌ఎస్‌కు కవిత స్టార్ క్యాంపెయినర్ అని ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ’మహిళగా కల్వకుంట్ల కవిత బెయిల్‌కు అర్హురాలు. ఆమె అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి సాక్ష్యం లేదు. కవిత అరెస్ట్‌కు సరైన ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారు’ అంటూ కోర్టుకు వెల్లడించారు. ఇడి కస్టడీలో ఉండగానే ఎందుకు సిబిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.

తమ రాజకీయ పార్టీకి కవిత స్టార్ క్యాంపెయినర్ అని, ఇప్పుడు ఆమె ప్రతిపక్షంలో ఉన్నారని వాదించారు. ఆమె పార్టీ రూలింగ్‌లో ఉన్నప్పుడే కేసును ప్రభావితం చేయలేదని గుర్తు చేశారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఉన్న కేసులో అరెస్ట్ అవసరం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, దీనిపై ఇడి, సిబిఐ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కవితకు బెయిల్ ఇస్తే, సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. ఈ కేసులో ఆమె కీలక సూత్రధారి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం కూడా ఉందని కోర్టుకు వెల్లడించారు. ఈ కేసులో కవిత కింగ్ పిన్ అని, కవితకు బెయిల్ ఇవ్వొద్దన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇడి, సిబిఐ వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ ఇచ్చేందుకు నిరాక రించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News