అవినీతిలో లూటీ చేసిన సొమ్మును పేద ప్రజలకు పంచి పెట్టే విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సోమవారం వేమగిరి వద్ద టిడిపి నాయకుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలసి ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ జార్ఖండ్ మంత్రికి చెందిన వ్యక్తిగత కార్యదర్శి నౌకరు నివాసంలో ఇడి స్వాధీనం చేసుకున్న నోట్ల గుట్టను ప్రస్తావిస్తూ అటువంటి వ్యక్తులు గాంధీ కుటుంబానికి సన్నిహితులు ఎలా అవుతారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నౌకరు ఇంటిని అవినీతి గిడ్డంగిగా మార్చివేశారని, ఇలా జరగడం ఇది మొదటిసారి కాదని, గతంలో జార్ఖండ్‌కు చెందిన ఎంపి నుంచి ఇంతకన్నా పెద్ద మొత్తంలోనే నోట్ల కట్టలు స్వాధీనం అయ్యాయని, ఆ నోట్ల కట్టలను లెక్కపెట్టడానికి మిషన్లు కూడా అలసి పోయాయని ప్రధాని వ్యాఖ్యానించారు.
వారి నల్ల ధనం పట్టుకున్న ప్రతి సారి కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు తనను దూషిస్తుంటారని, తాను వాటి గురించి ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు. అవినీతి ద్వారా లూటీ చేసిన సొమ్మును పేద ప్రజలకు సంచే విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు ఇడి రూ. 1.25 లక్షల కోట్లను జప్తు చేసింది, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా కలుపుకుంటే ఈ సొమ్ము మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఎవరి వద్ద నుంచి లూటీ చేశారో ఈ సొమ్మును వారికే తిరిగి ఇచ్చే విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. హక్కుదారులకు ఇప్పటికే రూ. 17,000 కోట్లు వాపసు చేశామని, పేదవారి హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లబోనని ఆయన తెలిపారు. ఇది మోడీ గ్యారెంటీ అంటూ ప్రకటించారు.