రాష్ట్రంలో సాగునీటి పారుదల రంగానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణ ప్రారంభమైంది. జ్యుడిషియల్ కమీషన్ చైర్మన్ జస్టిస్ పి.సి ఘోష్ సోమవారం రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశమయ్యారు.ప్రాజెక్టు వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. పలు కీలక అంశాలపై చర్చించారు. మేడిగడ్డ బ్యారేజిపై కేంద్ర ప్రభుత్వం నియమించిన డ్యామ్‌సేఫ్టి కమిటి ఇచ్చిన నివేదికలను కూడా పరిశీలించారు. మంగళవారం మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించనున్నారు. జస్టిస్ పిసి ఘోష్ విచారణ ప్రక్రియ ఈ నెల 12వరకూ కొనసాగనుంది. క్షేత్ర స్థాయిలో మేడిగడ్డ , అన్నారం సుందిళ్ల బ్యారేజిల పరిశీలన అనంతరం ఈ నెల 9న తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
అదే రోజు బిఆర్‌కే భవన్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. తొలిదఫా విచారణ సందర్భంగా కమీషన్ ప్రభుత్వానికి మూడు ఆదేశాలు జారీ చేసింది. ఆరుగురు సభ్యుల కమిటీకి సంబంధించిన నివేదికను సమర్పించాలని సూచించింది. ఏన్టీఎస్‌ఏ , విజిలెన్స్‌ల నుంచి తగిన సమాచారం తెప్పించాలని ఆదేశించింది. ప్రభుత్వం అందించే సమాచారాన్ని మరింత లోతుగా పరిశీలిన చేయనుంది. మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవటానికి గల కారణాలను అధ్యయనం చేయనుంది. సంబంధిత ఇంజనీర్లతోపాటు , నిర్మాణ సంస్థలను కూడా విచారణ జరపనుంది.