Monday, December 23, 2024

దురలవాట్లే మృత్యుపాశాలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ దేశాలను వణికిస్తున్న రోగాలలో క్యాన్సర్ ఒకటి. ఒకప్పుడు దీనినే రాచపుండు అనేవారు. రాజులకు మాత్రమే వచ్చే రోగమనీ, పేదల జోలికి ఇది రాదనీ భావించేవారు.కానీ, ఇప్పుడీ మహమ్మారికి రాజు పేద అనే తేడా లేదు. ఎవరినైనా, ఎప్పుడైనా ఆవహించి ఇట్టే మృత్యుపాశం విసిరి, ప్రాణాలను కబళించే ఈ వ్యాధికి పూర్తిగా అడ్డుకట్ట వేయడంలో వైద్యరంగం ఇప్పటికీ అనుకున్న స్థాయిలో పురోగతి సాధించలేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల మన దేశాన్ని వక్షోజ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్ పట్టిపీడిస్తున్నాయి. ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియని క్యాన్సర్ మహమ్మారి సోకిందని తెలుసుకునేలోగానే ప్రాణాలు గాలిలో కలసిపోతున్న కేసులే ఎక్కువ.

మొదటి రెండు రకాల క్యాన్సర్ లోనూ ఈ రకమైన లక్షణాలు ఎక్కువ కాగా మూడోదైన నోటి క్యాన్సర్.. ప్రధానంగా దురలవాట్ల కారణంగా ప్రబలుతోంది. పొగాకు, ధూమపానం, గుట్కా, జర్దా వంటివి నోటి క్యాన్సర్‌కు కారణమై ఉసురు తీస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నోటి క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట రెండు వంతులు భారత దేశంలోనే ఉన్నాయని టాటా మెమోరియల్ సెంటర్ జరిపిన తాజా అధ్యయనంలో తేలడం కలవరం కలిగించేదే. 2019- 2022 మధ్యకాలంలో క్యాన్సర్ చికిత్స తీసుకున్న 100 మందిపై జరిపిన అధ్యయనంలో 91 శాతం మరణాలు లేదా నయం చేయలేని క్యాన్సర్లు 41 ఏళ్ల లోపు వయసువారిలోనే సంభవించినట్లు వెల్లడైంది. నోటి క్యాన్సర్ల కారణంగా మన దేశంలో ఉత్పాదకత నష్టం 2022లో 560 కోట్ల డాలర్ల పైమాటేనని ఈ అధ్యయనం ద్వారా వెలుగుచూసిన మరో విషయాన్ని అలా ఉంచితే, ఈ ప్రాణాంతక వ్యాధిని అరికట్టాల్సిన ఆవశ్యకతను ఈ అధ్యయనం నొక్కి చెబుతోందన్న విషయాన్ని గ్రహించాలి.

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో క్యాన్సర్ వ్యాప్తి అంతగా లేనప్పటికీ తక్కువగా ఉందని మాత్రం చెప్పలేం. ఎందుకంటే 2020 నుంచి భారతదేశంలోనూ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 2021లో 14 లక్షల క్యాన్సర్ రోగులు ఉండగా, ఆ మరుసటి సంవత్సరానికే ఈ గణాంకాల్లో 60 వేల కేసుల పెరుగుదల కనిపించింది.2025 నాటికి ఈ సంఖ్య 15.70 లక్షలకు చేరుకుంటుందని ఓ అంచనా. మన దేశంలో దక్షిణాదివారికంటే, ఉత్తర భారతంలో పొగాకు, జర్దా, గుట్కా నమిలే అలవాటు ప్రబలంగా ఉంది. మొదట కాలక్షేపానికి అన్నట్లుగా వీటికి అలవాటు పడేవారు, ఆ తర్వాత వదలించుకోవాలన్నా వీలుకాని పరిస్థితికి చేరుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో నోటి క్యాన్సర్‌కు గురైనవారిలో రోగ నిర్థారణ జరిగే సరికే పరిస్థితి చేయి దాటిపోతోంది. నిపుణులైన డాక్టర్ల కొరత, క్యాన్సర్‌ను గుర్తించే అధునాతన పరికరాల లేమి వంటివాటితో పాటు పేదరికం, నిరక్షరాస్యత కారణంగా రోగాన్ని తేలికగా తీసుకునే గ్రామీణుల అమాయకత్వం కూడా వారి ప్రాణాల మీదకు తెస్తోంది. పొగాకును నమలడం వల్లనే 80 నుంచి 90 శాతం మంది రోగాన్ని కొనితెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారకాల్లో ఒకటైన గుట్కాను మన దేశంలో నిషేధించినా, పటుతరమైన నిఘా లేమి కారణంగా దొడ్డిదారిన మార్కెట్లో దొరుకుతూనే ఉంది. ఏదైనా అలవాటు కానంతవరకే. అలవాటయ్యాక మానుకోవడం అంత సులువు కాదు. పొగాకు నమలడం, ధూమపానం వంటి దురలవాట్లు మొదలయ్యాయంటే వదిలించుకోవడం కష్టం. అనగ అనగ రాగం.. తినగ తినగ రోగం అని పెద్దలు ఊరకే అనలేదు. పొగాకు నమలడం నోటి క్యాన్సర్‌కే కాకుండా మెడ, తల క్యాన్సర్లకు కూడా కారణమవుతోందన్న వైద్యుల హెచ్చరికలు చెవికి ఎక్కించుకునేవారు కరవవుతున్నారు.

దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలు క్యాన్సర్ నిరోధానికి చేస్తున్న ప్రచారం కొంతవరకూ సత్ఫలితాలను ఇస్తున్నా, నగరాలు, కొండొకచో పట్టణాలకు మాత్రమే పరిమితమైన అధునాతన వైద్య సేవలు ఇప్పటికీ గ్రామాల దరిదాపులకు కూడా చేరుకోవట్లేదు. దీంతో పాటు పట్టణ ప్రాంతాల్లో రిహాబిలిటేషన్ కేంద్రాల కొరత రోగుల పాలిట శాపంగా మారింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు దురలవాట్లకు లోనైనవారిని నోటి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడంవల్ల మొగ్గ దశలోనే ఈ వ్యాధిని అరికట్టే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి వైద్య సేవలు అందిస్తూ, సలహాలు, సూచనలు ఇచ్చే ఆరోగ్య కార్యకర్తలు ఈ విషయంలో కీలకపాత్ర పోషించవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News