Sunday, January 19, 2025

సామాజిక బాధ్యత మరిచిన ‘ఐపిఎల్’

- Advertisement -
- Advertisement -

గుట్కా ఉత్పత్తులను ప్రచారం చేయడం భారత దేశంలో చట్టరీత్యా నేరం. దీంతో విమల్, కమలాపసంద్ లాంటి కంపెనీలు పాన్ మసాలా, ఇలైచీ ముసుగులో మార్కెట్లోకి వచ్చి ప్రమోషన్ చేసుకుంటున్నాయి. నీళ్లు, సోడా ముసుగులో మద్యం కంపెనీలు తమ ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నాయి. ఐపిఎల్ మ్యాచ్‌ల మధ్యలో ఇలాంటి ప్రకటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హీరో, హీరోయిన్లుగా చెప్పుకునే నటులు, స్పోర్ట్ స్టార్స్‌గా కీర్తించబడే క్రీడా కారులు తమ సామాజిక బాధ్యతను మరిచి కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా జూదం, సరోగేట్ అడ్వర్టయిజింగ్‌లో పాలు పంచుకుంటున్నారు.

ఇస్ ఖేల్ మే ఆదత్ లగ్నా యా ఆర్థిక్ జోఖ్యం సంభవ్ హై.. జిమ్మేదారిసే ఖేలే (ఈ ఆట వ్యసనంగా మారవచ్చు లేదా ఆర్థిక ప్రమా దం కూడా సంభవించవచ్చు. జాగ్రత్తగా ఆడండి..) ‘జియో సినిమా’ లో ఐపిఎల్ మ్యాచ్ చూస్తున్న వారెవరికైనా కనిపించే ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11 ప్రకటన ఆఖరిలో చిన్న అక్షరాల్లో చూపించే హెచ్చరిక ఇది. మైసర్కిల్ 11, పోకర్ బాజీ ప్రకటనల్లో కూడా దాదాపు ఇదే హెచ్చరిక కనిపిస్తుంది. టివి, ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్‌లలో ఐపిఎల్ మ్యాచ్‌లు వీక్షిస్తున్న వారికీ దాదాపు ఇలాంటి ప్రకటనలే దర్శనమిస్తాయి.

ఓ వైపు జూదంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి యువత ఆత్మహత్యలు చేసుకుంటుండడం.. గుట్కా లాంటివి తిని క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వేళ.. ఐపిఎల్ లో ఇలాంటి ప్రకటనలకు చోటు కల్పిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. భారత దేశంలో కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్(రెగ్యులేషన్) చట్టం ద్వారా ఆల్కహాల్, సిగరెట్లు, ఇతర పొగాకు ఆధారిత ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం విధించారు. దీంతో చట్టాలకు చిక్కకుండా, సరోగేట్ అడ్వర్టయిజింగ్ ద్వారా ఆ కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచారం నిర్వహిస్తున్నాయి. గుట్కా ఉత్పత్తులను ప్రచారం చేయడం భారత దేశంలో చట్టరీత్యా నేరం. దీంతో విమల్, కమలాపసంద్ లాంటి కంపెనీలు పాన్ మసాలా, ఇలైచీ ముసుగులో మార్కెట్లోకి వచ్చి ప్రమోషన్ చేసుకుంటున్నాయి. నీళ్లు, సోడా ముసుగులో మద్యం కంపెనీలు తమ ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నాయి. ఐపిఎల్ మ్యాచ్‌ల మధ్యలో ఇలాంటి ప్రకటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

హీరో, హీరోయిన్లుగా చెప్పుకునే నటులు, స్పోర్ట్ స్టార్స్‌గా కీర్తించబడే క్రీడాకారులు తమ సామాజిక బాధ్యతను మరిచి కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా జూదం, సరోగేట్ అడ్వర్టయిజింగ్‌లో పాలు పంచుకుంటున్నారు. సమాజానికి మేలు చేసే బదులు పరోక్షంగా కీడుకు కారణమవుతున్నారు. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు, పాన్ మసాలా ప్రకటనల్లో నటించవద్దని నేషనల్ ఆర్గనైజేషన్ ఆప్ టొబాకో ఎరాడికేషన్ (ఎన్‌ఒటిఇ) కోరడంతో కొందరు ప్రముఖులు గతంలో ఇలాంటి యాడ్స్ నుంచి తప్పుకున్నారు. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 పేరు ఏదైతేనేం.. అన్నీ ఊరించి ఊబిలోకి దింపే యాప్‌లే. ఈ ప్లాట్ ఫామ్‌లకు పెద్ద పెద్ద క్రీడాకారులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం మొదలు ఇది వ్యసనంగా మారే వరకు అన్ని కంపెనీలదీ ఒకే దారి.

ముందుగా ఉచితంగా ఆడే అవకాశం కల్పించి, ఆ తర్వాత డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఆపై ప్రతి ఆటకు కనీస మొత్తం చెల్లించిన తర్వాతే అందులో భాగమయ్యేందుకు ఆస్కారమిస్తాయి. క్రికెట్ లేదా మరే క్రీడపైనైనా తనకు ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతోనే డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో ఎంతో మంది దీనికి అలవాటు పడిపోతున్నారు. ఆ తర్వాత అంచనాల లెక్క తప్పి పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. కానీ నిర్వాహకులకు మాత్రం అందిన కాడికి దండుకుంటున్నారు.
ఎవరు గెలిచినా, ఓడినా వారికి మాత్రం ఆదాయం సమకూరుతున్నది. ఈ ఫాంటసీ లీగ్ లు పక్కా జూదం అంటూ నష్టపోయినవారు గతంలో కోర్టుకెక్కారు. అయితే ‘ఇందులో ఆడాలంటే తెలివితేటలు, ఆటలపై పరిజ్ఞానం కూడా అవసరం కాబట్టి పూర్తి జూదంగా పరిగణించలేం’ అంటూ కోర్టు డ్రీమ్ 11కు అనుకూలం గా తీర్పు ఇచ్చింది.

అయితే చట్టంలోని కొన్ని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని కొన్ని సంస్థలు తమ వ్యవహారాలు నడిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, బెట్టింగ్ యాప్‌లు పూర్తిగా మోసపూరితమని, పందెం కాసినప్పుడు తొలుత లాభాలు ఇచ్చేలా అల్గారిథమ్ రూపొందిస్తారని.. ఆ తర్వాత నష్టాలు వచ్చేలా చేస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు అలవాటు పడి చాలా మంది తమ ఆస్తులను పోగొట్టుకొని రోడ్డుపై పడుతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో అన్నీ కోల్పోయిన వారు కొన్ని సార్లు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొన్ని సార్లు ఇది హత్యలకు సైతం దారితీస్తోంది. చాలా మంది నేరాల బాట పడుతున్న ఘటనలు సైతం వెలుగు చూస్తున్నాయి.

బెట్టింగ్‌కు అలవాటుపడి సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలం క్రితం కెపిహెచ్‌బి పోలీసులు ఓ దొంగను అరెస్టు చేయగా.. చోరీలు ఎందుకు చేస్తున్నావని అడిగితే.. బెట్టింగ్ కోసం చేస్తున్నట్లు చెప్పాడు. కాగా, సామాజిక దుష్పరిణామాలకు కారణమవుతున్న బెట్టింగ్, గుట్కా లాంటి కంపెనీలను ప్రోత్సహించకుండా ‘ఐపిఎల్’ నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే డిమాండ్ వినిపిస్తున్నది.

మహమ్మద్ ఆరిఫ్
9618400190

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News