Thursday, January 16, 2025

నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇస్లాంను, ముస్లింలను తాను వ్యతిరేకించనని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల పోరు వాడిగా వేడిగా సాగుతున్న తరుణంలో ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంలో ప్రధాని మోడీ ఆ మాట అన్నారు. ‘అది మా విధానం కాదు. నెహ్రూ కాలం నుంచే వారు (ప్రతిపక్షాలను ఉద్దేశించి) ఈ కథనాలు ప్రచారం చేస్తున్నారు. ముస్లిం వ్యతిరేకులు అని మాపై ఆరోపణలు చేస్తున్నారు. దాని నుంచి లబ్ధి పొందాలన్నది వారి ధ్యేయం. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి తాము వారికి స్నేహితులమని అంటూ కపట ప్రేమ ప్రదర్శిస్తారు.

కానీ ముస్లిం సమాజం చైతన్యవంతంగా మారింది. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు వారి ఆందోళనపై నేను నిజాయతీగా ఉన్నానని ముస్లిం సోదరీమణులు భావించారు. ఆయుష్మాన్ కార్డులు ఇచ్చినప్పుడు, కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చినప్పుడు వారు అదే విధంగా భావించారు. నేను ఎవరిపైనా వివక్ష చూపడం లేదని వారు అర్థం చేసుకున్నారు. ప్రతిపక్షాల అబద్ధాలు బహిర్గతం అయ్యాయి. అదే వారి బాధ. అందుకే తప్పుదోవ పట్టించేందుకు రకరకాల అబద్ధాలు చెబుతూనే ఉంటారు’ అని మోడీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

ప్రధాని మోడీ కొన్ని రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ కనుక కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే ప్రజల సంపద అంతా మైనారిటీలు అయిన ముస్లింలకు పంచుతుందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ‘ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా తిరిగి పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో సూచించింది. ఆ మేరకు దేశ సంపదను అంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు’ అని మోడీ విమర్శించారు. ఆ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయం అయ్యాయి. ఎన్నికల్లో లబ్ధి కోసం ఒక వర్గానికి వ్యతిరేకంగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆ క్రమంలోనే ప్రధాని మోడీ స్పందన వచ్చింది. అదే విధంగా తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఎన్నికల్లో వోటు హక్కు వినియోగించుకోవాలని ముస్లిం వర్గానికి మోడీ పిలుపు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News